indonesia open super series
-
తొలి రౌండ్లోనే సింధు పరాజయం
ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ పీవీ సింధు 14–21, 18–21తో హి బింగ్ జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిప్రణీత్ 16–21, 19–21తో విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–15, 21–8తో ఇషిక జైస్వాల్ (అమెరికా)–గురజాడ శ్రీవేద్య (భారత్) జోడీపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
సింధు, శ్రీకాంత్ శుభారంభం
జకార్తా: ఇండోనేషియాలో ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 11–21, 21–15, 21–15 అయా ఒహొరి(జపాన్)పై చెమటోడ్చి నెగ్గింది. ఈ ఏడాది తొలి టైటిల్ సాధించాలని బరిలోకి దిగిన సింధుకు తొలి సెట్లో ప్రత్యర్థి షాక్ ఇచ్చింది. అనంతరం పుంజుకున్న సింధు రెండు, మూడు సెట్లతోపాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్, వరల్డ్ నెం.9 శ్రీకాంత్ 21–14, 21–13 కెంటా నిషి మోటో(జపాన్)ను చిత్తుచే శాడు. 38 నిమిషాల్లో్లనే ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ ధాటికి ప్రత్యర్థి తేలిపోయాడు. కాగా, మరో ఇద్దరు భారత ఆట గాళ్లు హెచ్ఎస్ ప్రణయ్, భమిడిపాటి సాయిప్రణీత్ టోర్నీ నుంచి నిష్క్రమిం చారు. వరల్డ్ నెం.23 సాయిప్రణీత్ 15–21, 21–13, 10–21తో ప్రపంచ 37వ ర్యాంకర్ వాంగ్ వింగ్ కి విన్సెంట్(హాంగ్‌కాంగ్) చేతిలో చిత్తవగా, వరల్డ్ నెం.32 ప్రణయ్ 21–19, 18–21, 20–22తో ప్రపంచ నెం.2 షి యుకి(చైనా) చేతిలో పోరాడి ఓడాడు. అలాగే మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి– అశ్విని పొన్నప్ప(భారత్) జోడీ 13–21, 11–21తో టొంటొవి అహ్మద్–విన్నీ ఒక్తవిన కండౌ(ఇండోనేషియా) చేతిలో ఓడింది. -
జకార్తాలో శ్రీకాంతులు...
♦ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ విజేత శ్రీకాంత్ ♦ ఫైనల్లో 47వ ర్యాంకర్ సకాయ్‌పై విజయం ♦ పురుషుల సింగిల్స్‌లో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయుడు ♦ కెరీర్లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ ♦ రూ. 48 లక్షల 33 వేల ప్రైజ్‌మనీ సొంతం అంతర్జాతీయ వేదికపై మన రాకెట్ మళ్లీ మెరిసింది. ఈ సీజన్లో వరుసగా రెండోసారి భారత క్రీడాకారుడి ఖాతాలో సూపర్ సిరీస్ టైటిల్ చేరింది. గత ఏప్రిల్‌లో సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గగా... అదే టోర్నీ ఫైనల్లో సాయిప్రణీత్ చేతిలో ఓడిన కిడాంబి శ్రీకాంత్... తాజాగా ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో చాంపియన్‌గా అవతరించి భారత క్రీడాభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచాడు. జకార్తా (ఇండోనేసియా): అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగినప్పటికీ... మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఆటతీరును మెరుగుపర్చుకొని ఆడిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో చాంపియన్‌గా ఆవిర్భవించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 37 నిమిషాల్లోనే 21–11, 21–19తో ప్రపంచ 47వ ర్యాంకర్ కజుమాసా సకాయ్ (జపాన్)పై గెలిచాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 75 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 48 లక్షలు 33 వేలు)తోపాటు 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) శ్రీకాంత్‌కు రూ. 5 లక్షలు నజరానా ప్రకటించింది. దూకుడే దూకుడు... భారత్‌కే చెందిన ప్రణయ్‌తో జరిగిన సెమీస్‌లో ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలిచి ఫైనల్‌కు చేరిన సకాయ్ను శ్రీకాంత్ తక్కువ అంచనా వేయలేదు. సకాయ్ ఆటతీరుపై మంచి హోంవర్క్ చేసి వచ్చిన శ్రీకాంత్ ఆద్యంతం దూకుడుగానే ఆడాడు. ర్యాలీలు సుదీర్ఘంగా సాగకుండా జాగ్రత్త పడ్డాడు. షటిల్స్‌ను నియంత్రిస్తూ ఆడిన శ్రీకాంత్ కొట్టిన పలు స్మాష్ షాట్లకు సకాయ్ వద్ద జవాబు లేకపోయింది. తొలి గేమ్‌ను కేవలం 13 నిమిషాల్లోనే ముగించిన ఈ తెలుగు తేజం రెండో గేమ్‌లో మాత్రం కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. నెట్ గేమ్‌లో, ర్యాలీల్లో పరిణతి కనబరిచిన సకాయ్ ఒకదశలో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ శ్రీకాంత్ సంయమనం కోల్పోలేదు. విరామం తర్వాత తన రాకెట్ జోరు పెంచిన శ్రీకాంత్ స్కోరును 13–13 వద్ద సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ పాయింట్ పాయింట్‌కూ పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తన కెరీర్లో మరో చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ టోర్నీ టైటిల్ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడు శ్రీకాంత్. ఓవరాల్‌గా భారత్ నుంచి రెండో ప్లేయర్. గతంలో సైనా మహిళల సింగిల్స్ విభాగంలో (2009, 2010, 2012లలో) మూడుసార్లు విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015 ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో శ్రీకాంత్ చాంపియన్‌గా నిలిచాడు. ప్రశంసల జల్లు... ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన శ్రీకాంత్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అభినందించారు. ‘శ్రీకాంత్ నీ విజయంపట్ల మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం’ అని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రశంసించారు. ‘శ్రీకాంత్... హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ప్రణబ్ ముఖర్జీ... ‘నీ విజయంపట్ల అందరూ గర్వంగా ఉన్నారు’ అని అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉత్సాహమిచ్చే విజయం... నేను సూపర్ సిరీస్ టోర్నీ నెగ్గి రెండేళ్లు గడిచాయి. తాజా విజయం నాకెంతో అవసరం. గత ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్ సిరీస్ ఫైనల్లో ఓడిన తర్వాత మరో టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఆనందాన్ని చ్చింది. ఫైనల్లో దూకుడైన ఆటతీరు ఫలితాన్నిచ్చింది. వచ్చే వారం ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఆడతాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు ఇదే చివరి టోర్నీ కావడంతో ఇండోనేసియా ఓపెన్ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాను. మున్ముందు మరిన్ని విజయాలు వస్తాయని నమ్మకంతో ఉన్నాను. నా హృదయంలో ఇండోనేసియాకు చెందిన కోచ్ ముల్యో హన్డోయోకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సహాయక కోచ్‌గా వచ్చాక నా ఆటతీరు మరింతగా మెరుగుపడింది. ఇండోనేసియాలో బ్యాడ్మింటన్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇలాంటి వేదికపై విజేతగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. –సాక్షితో కిడాంబి శ్రీకాంత్ -
శ్రీకాంత్ సాధించాడు..
జకర్తా: ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్ గా సరిపెట్టుకున్న భారత్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ వేటలో సఫలమయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో శ్రీకాంత్ 21-11, 21-19 తేడాతో సకాయ్(జపాన్)పై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఇది శ్రీకాంత్ కు తొలి ఇండోనేసియా సూపర్ సిరీస్ టైటిల్ కాగా, ఓవరాల్ గా ఈ టైటిల్ ను సాధించిన రెండో భారత్ ప్లేయర్. అంతకుముందు సైనా నెహ్వాల్(2010) ఇండోనేసియా టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్. ఇండోననేసియా ఫైనల్ పోరులో తొలి గేమ్ ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో మాత్రం పోరాడాడు. సకాయ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో శ్రీకాంత్ ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు అనుభవాన్ని ఉపయోగించిన శ్రీకాంత్ రెండు పాయింట్లతో రెండో గేమ్ ను దక్కించుకుని విజేతగా అవతరించాడు. ఇండోనేసియా సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించిన శ్రీకాంత్ ను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
సూపర్ శ్రీకాంత్
♦ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌పై గెలుపు ♦ ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్లోకి జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ సంచలన జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 18–21, 24–22తో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను ఇంటిదారి పట్టించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో క్వాలిఫయర్, జపాన్ యువ సంచలనం కజుమాసా సకాయ్తో శ్రీకాంత్ ఆడతాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ తన కెరీర్లో నాలుగోసారి సూపర్ సిరీస్ టోర్నమెంట్లో టైటిల్ పోరుకు చేరుకున్నాడు. 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015 ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రీకాంత్... ఈ ఏడాది ఏప్రిల్‌లో సింగపూర్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత్‌కే చెందిన సాయిప్రణీత్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. పోరాడి ఓడిన ప్రణయ్ మరోవైపు భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ సంచలనాలకు సెమీఫైనల్లో తెరపడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై, క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచిన ప్రణయ్... సెమీఫైనల్లో మాత్రం క్వాలిఫయర్, ప్రపంచ 47వ ర్యాంకర్ కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో 21–17, 26–28, 18–21తో పరాజయం పాలయ్యాడు. నేటి ఫైనల్స్ మధ్యాహ్నం గం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రణయ్ నాదం
సెమీస్‌లో ప్రణయ్, శ్రీకాంత్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ జకర్తా : ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో భారత ప్లేయర్లు హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌ల సంచలన ఆటతీరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌ల్లో ఇరువురు తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌కు చేరుకున్నారు. తొలుత జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్, ప్రణయ్ 21–18, 16–21, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై సంచలన విజయం నమోదు చేశాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ కీలకదశలో సత్తాచాటాడు. తొలిగేమ్ ఆరంభంలో 8–5తో ముందంజ వేసిన ప్రణయ్.. అదే జోరులో 11–7తో ఆధిక్యం ప్రదర్శించాడు. అనంతరం చైనీస్ ప్లేయర్ పుంజుకోవడంతో 18–15తో ప్రణయ్ ఆధిక్యం తగ్గింది. ఈదశలో వరుస పాయింట్లు సాధించిన భారత్ ప్లేయర్ తొలిగేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండోగేమ్ ఆరంభంలో ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో చాలాసార్లు స్కోర్లు సమమయ్యాయి. అయితే ఈదశలో తన అనుభవన్నాంత రంగరించిన చెన్ గేమ్‌ను తన సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడోగేమ్ ఆరంభంలో 1–4తో వెనుకంజలో నిలిచిన ప్రణయ్.. నెమ్మదిగా స్కోరును సమం చేశాడు. 17–17తో మ్యాచ్ సమంగా ఉన్నప్పుడు కీలకదశలో పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, శ్రీకాంత్ 21–15, 21–14తో ప్రపంచ 19వ ర్యాంకర్ జు వీ వాంగ్ (చైనీస్‌తైపీ)పై అలవోకగా గెలుపొందాడు. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీ.. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. సెమీస్‌లో అన్‌సీడేడ్ కజుమస సకాయ్ (జపాన్)తో ప్రణయ్.. ప్రపంచ నం.1, రెండోసీడ్ సన్ వాన్ హో (దక్షిణకొరియా)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. ఈరోజు మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. మెరుగైన ప్రదర్శన చేస్తానని భావించా. మంచి ఫిట్నెస్తో ఈ మ్యాచ్‌లో తుదివరకు ఆడగలిగాను. ఇండియా ఓపెన్, ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీల తర్వాత నా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించా. నూతన కొచ్ ముల్యో హండోయో ఆధ్వర్యంలో కఠోర శిక్షణ తీసుకున్నా. – ప్రణయ్ -
సాయిప్రణీత్‌కు సవాల్
జకార్తా: వరుసగా రెండు అంతర్జాతీయ టైటిల్స్ సాధించి జోరు మీదున్న భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్ మరో టైటిల్‌పై గురి పెట్టాడు. ఈరోజు(సోమవారం) మొదలయ్యే ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో సాయిప్రణీత్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ విభాగాల్లో మ్యాచ్‌లు ఉంటాయి. మంగళవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో విజేతగా నిలిచిన సాయిప్రణీత్‌కు ఇండోనేసియా ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్లోనే అగ్ని పరీక్ష ఎదురుకానుంది. మొదటి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో సాయిప్రణీత్ ఆడనున్నాడు. సాయిప్రణీత్‌తోపాటు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ బరిలో ఉన్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.