శ్రీకాంత్ సాధించాడు..
జకర్తా: ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్ గా సరిపెట్టుకున్న భారత్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ వేటలో సఫలమయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో శ్రీకాంత్ 21-11, 21-19 తేడాతో సకాయ్(జపాన్)పై గెలిచి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఇది శ్రీకాంత్ కు తొలి ఇండోనేసియా సూపర్ సిరీస్ టైటిల్ కాగా, ఓవరాల్ గా ఈ టైటిల్ ను సాధించిన రెండో భారత్ ప్లేయర్. అంతకుముందు సైనా నెహ్వాల్(2010) ఇండోనేసియా టైటిల్ గెలిచిన తొలి భారత ప్లేయర్.
ఇండోననేసియా ఫైనల్ పోరులో తొలి గేమ్ ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్లో మాత్రం పోరాడాడు. సకాయ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో శ్రీకాంత్ ఎక్కువగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు అనుభవాన్ని ఉపయోగించిన శ్రీకాంత్ రెండు పాయింట్లతో రెండో గేమ్ ను దక్కించుకుని విజేతగా అవతరించాడు. ఇండోనేసియా సూపర్ సిరీస్ టైటిల్ ను సాధించిన శ్రీకాంత్ ను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో శ్రీకాంత్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.