సూపర్ శ్రీకాంత్
♦ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌పై గెలుపు
♦ ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్లోకి
జకార్తా: ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ సంచలన జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 18–21, 24–22తో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను ఇంటిదారి పట్టించాడు.
ఆదివారం జరిగే ఫైనల్లో క్వాలిఫయర్, జపాన్ యువ సంచలనం కజుమాసా సకాయ్‌తో శ్రీకాంత్ ఆడతాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ తన కెరీర్‌లో నాలుగోసారి సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు చేరుకున్నాడు. 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో, 2015 ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో విజేతగా నిలిచిన శ్రీకాంత్... ఈ ఏడాది ఏప్రిల్‌లో సింగపూర్ సూపర్ సిరీస్ టోర్నీలో భారత్‌కే చెందిన సాయిప్రణీత్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు.
పోరాడి ఓడిన ప్రణయ్
మరోవైపు భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలనాలకు సెమీఫైనల్లో తెరపడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ లీ చోంగ్ వీ (మలేసియా)పై, క్వార్టర్ ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై గెలిచిన ప్రణయ్... సెమీఫైనల్లో మాత్రం క్వాలిఫయర్, ప్రపంచ 47వ ర్యాంకర్ కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో 21–17, 26–28, 18–21తో పరాజయం పాలయ్యాడు.
నేటి ఫైనల్స్
మధ్యాహ్నం గం 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం