ప్రణయ్ నాదం
సెమీస్‌లో ప్రణయ్, శ్రీకాంత్
ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ
జకర్తా : ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో భారత ప్లేయర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌ల సంచలన ఆటతీరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచ్‌ల్లో ఇరువురు తమ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌కు చేరుకున్నారు. తొలుత జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్, ప్రణయ్ 21–18, 16–21, 21–19తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)పై సంచలన విజయం నమోదు చేశాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్ కీలకదశలో సత్తాచాటాడు. తొలిగేమ్ ఆరంభంలో 8–5తో ముందంజ వేసిన ప్రణయ్.. అదే జోరులో 11–7తో ఆధిక్యం ప్రదర్శించాడు. అనంతరం చైనీస్ ప్లేయర్ పుంజుకోవడంతో 18–15తో ప్రణయ్ ఆధిక్యం తగ్గింది.
ఈదశలో వరుస పాయింట్లు సాధించిన భారత్ ప్లేయర్ తొలిగేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండోగేమ్ ఆరంభంలో ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో చాలాసార్లు స్కోర్లు సమమయ్యాయి. అయితే ఈదశలో తన అనుభవన్నాంత రంగరించిన చెన్ గేమ్‌ను తన సొంతం చేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడోగేమ్ ఆరంభంలో 1–4తో వెనుకంజలో నిలిచిన ప్రణయ్.. నెమ్మదిగా స్కోరును సమం చేశాడు. 17–17తో మ్యాచ్ సమంగా ఉన్నప్పుడు కీలకదశలో పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, శ్రీకాంత్ 21–15, 21–14తో ప్రపంచ 19వ ర్యాంకర్ జు వీ వాంగ్ (చైనీస్‌తైపీ)పై అలవోకగా గెలుపొందాడు. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీ.. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించాడు. సెమీస్‌లో అన్‌సీడేడ్ కజుమస సకాయ్ (జపాన్)తో ప్రణయ్.. ప్రపంచ నం.1, రెండోసీడ్ సన్ వాన్ హో (దక్షిణకొరియా)తో శ్రీకాంత్ తలపడనున్నాడు.
ఈరోజు మ్యాచ్ చాలా కఠినంగా సాగింది. మెరుగైన ప్రదర్శన చేస్తానని భావించా. మంచి ఫిట్‌నెస్‌తో ఈ మ్యాచ్‌లో తుదివరకు ఆడగలిగాను. ఇండియా ఓపెన్, ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీల తర్వాత నా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించా. నూతన కొచ్ ముల్యో హండోయో ఆధ్వర్యంలో కఠోర శిక్షణ తీసుకున్నా.
– ప్రణయ్