ఒకే ఒక్కడు...
♦ వరుసగా మూడో సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లో శ్రీకాంత్
♦ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు
♦ రియో ఒలింపిక్ చాంపియన్ చెన్‌లాంగ్‌తో నేడు టైటిల్ పోరు
అంతా కలలా అనిపిస్తోంది. రెండేళ్ల తర్వాత సూపర్ సిరీస్ ఫైనల్ (సింగపూర్ ఓపెన్) ఆడాను. మళ్లీ రెండు వారాల వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టోర్నీల్లో (ఇండోనేసియా, ఆస్ట్రేలి యన్ ఓపెన్) ఫైనల్‌కు చేరుకున్నాను. ఇదంతా కలగానే ఉంది. షి యుకితో మ్యాచ్‌లో ఆద్యంతం నియంత్రణతో ఆడాను. ఎక్కడా సులువుగా పాయింట్లు ఇవ్వలేదు. ఇక చెన్ లాంగ్‌తో జరిగే ఫైనల్లో నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాను. ఫలితం ఎలా ఉంటుందనే విషయంపై ఆలోచించడంలేదు. –శ్రీకాంత్
సిడ్నీ: భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తన అద్వితీయ ప్రదర్శనను కొనసాగిస్తూ... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–10, 21–14తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ షి యుకి (చైనా)ను బోల్తా కొట్టించాడు. 37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేము ల్లోనూ ఆరంభంలో కాస్త పోటీ ఎదుర్కొన్న శ్రీకాంత్ ఆ తర్వాత ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.
ఈ గెలుపుతో హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల శ్రీకాంత్ వరుసగా మూడో సూపర్ సిరీస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. తద్వారా భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రికా ర్డు సృష్టించాడు. పురుషుల బ్యాడ్మింటన్‌లో మాత్రం ఈ ఘనత నమోదు చేసిన ఐదో క్రీడాకారుడిగా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. 2007లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సూపర్ సిరీస్ టోర్నీలు ప్రవేశపెట్టాక లిన్ డాన్ (చైనా), లీ చోంగ్‌వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా), సోనీ ద్వికుంకురో (ఇండోనేసియా) మాత్రమే వరుసగా మూడు సూపర్ సిరీస్ టోర్నీలలో ఫైనల్‌కు చేరుకున్నారు.
గత ఏప్రిల్‌లో సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన శ్రీకాంత్, గత వారం ఇండోనేసియా ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)తో ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 0–5తో వెనుకజంలో ఉన్నాడు. చెన్ లాంగ్‌తో ఇప్పటివరకు ఐదుసార్లు ఆడిన శ్రీకాంత్ అతనిపై ఒక్క గేమ్ మాత్రమే గెలవడం గమనార్హం. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ ఫామ్ చూస్తుంటే ఆదివారం సంచలన ఫలితం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
నేటి ఫైనల్స్ ఉదయం గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం