గ్వాంగ్జు (కొరియా): సీజన్‌లో తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్... నేటి నుంచి మొదలయ్యే కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్– 300 టోర్నమెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇప్పటికే భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్ దూరంకాగా... తాజాగా వారి జాబితాలో సైనా నెహ్వాల్ చేరింది. వ్యక్తిగత కారణాలతో ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో మహిళల విభాగంలో భారత ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరోవైపు హాంకాంగ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన శ్రీకాంత్ ఆ ప్రదర్శనను పునరావృతం చేయా లనే పట్టుదలతో ఉన్నాడు. అతడు తన తొలి రౌండ్ పోరులో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)ను ఎదుర్కోనున్నాడు. ముఖాముఖి పోరులో శ్రీకాంత్ 10–3తో ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు. ఇతర భారత షట్లర్లలో ప్రపంచ 16వ ర్యాంకర్ సమీర్ వర్మ, అతని సోదరుడు సౌరభ్ వర్మలు బరిలో ఉన్నారు. తొలి రౌండ్‌లో కజుమస సకాయ్ (జపాన్)తో సమీర్ తలపడుతుండగా... సౌరభ్ వర్మ క్వాలిఫయర్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment