బర్మింగ్‌హామ్: భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో మాజీ రన్నరప్ సైనానెహ్వాల్... పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా... ప్రపంచ మూడో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు మూడు గేమ్‌లపాటు కష్టపడి గట్టెక్కారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో బ్రైస్ లెవెర్‌డెజ్ (ఫ్రాన్స్)తో 58 నిమిషాలపాటు జరిగిన జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 7–21, 21–14, 22–20తో గెలుపొందాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 19–20తో ఓటమి అంచుల్లో నిలిచాడు. ఈ స్కోరు వద్ద లెవెర్‌డెజ్ మరో పాయింట్ సాధించి ఉంటే శ్రీకాంత్‌కు ఓటమి ఎదురయ్యేది. కానీ కీలకదశలో శ్రీకాంత్ సంయమనం కోల్పోకుండా ఆడి పాయింట్ సాధించి స్కోరును 20–20తో సమం చేశాడు. ఆ తర్వాత వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. మరో మ్యాచ్‌లో సాయిప్రణీత్ 21–13, 15–21, 11–21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో పోరాడి ఓడిపోయాడు.
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 2015 రన్నరప్ సైనా నెహ్వాల్ 14–21, 18–21తో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. తై జు చేతిలో సైనాకిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. 2009 తర్వాత ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో సైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో సింధు 56 నిమిషాల్లో 20–22, 21–17, 21–9తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు ఆ తర్వాత కోలుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 14–21, 13–21తో మత్సుతోమో–తకహాషి (జపాన్) జోడీ చేతిలో... మేఘన–పూర్వీషా (భారత్) ద్వయం 14–21, 11–21తో షిహో తనకా–యోనోమోటో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జంట 20–22, 12–21తో మార్కస్ ఎలిస్–క్రిస్ లాంగ్‌రిడ్జ్ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–19, 21–13తో మార్విన్–లిండా (జర్మనీ) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
పరాజయం అంచుల నుంచి...
Published Thu, Mar 15 2018 1:12 AM | Last Updated on Thu, Mar 15 2018 1:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment