న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయ జూనియర్ టోర్నమెంట్‌లలో నిలకడగా రాణిస్తోన్న హైదరాబాద్ అమ్మాయి కుదురవల్లి శ్రీకృష్ణప్రియకు తగిన ప్రతిఫలం లభించింది. ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళల సీనియర్ జట్టులో 20 ఏళ్ల శ్రీకృష్ణప్రియ ఎంపికైంది. స్టార్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్, మరో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని సింగిల్స్ విభాగంలోని ఇతర సభ్యులు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో శ్రీకృష్ణప్రియ 58వ స్థానంలో ఉంది. డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి, అశ్విని పొన్నప్పలతోపాటు ప్రాజక్తా సావంత్, సంయోగిత, రితూపర్ణ దాస్, మిథిల బరిలోకి దిగుతారు. భారత పురుషుల జట్టు సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్, సమీర్ వర్మలకు చోటు లభించింది. డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, మనూ అత్రి, సుమీత్ రెడ్డి, శ్లోక్ రామచంద్రన్, ఎం.ఆర్.అర్జున్‌లను ఎంపిక చేశారు.
ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు మలేసియాలోని అలోర్ సెటార్ పట్టణంలో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. భారత్‌తోపాటు చైనా, మలేసియా, ఇండోనేసియా, దక్షిణ కొరియా, జపాన్, హాంకాంగ్, సింగపూర్, చైనీస్ తైపీ, కజకిస్తాన్, మాల్దీవులు, నేపాల్, ఫిలిప్పీన్స్ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ప్రతి పోటీలో మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పురుషుల, మహిళల టీమ్ విభాగాల్లో సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లు మే 20 నుంచి 27 వరకు బ్యాంకాక్‌లో జరిగే థామస్ కప్, ఉబెర్ కప్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
భారత జట్టులో శ్రీకృష్ణప్రియ
Published Fri, Jan 19 2018 1:07 AM | Last Updated on Fri, Jan 19 2018 1:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment