
'మేమిద్దరం మంచి ఫ్రెండ్స్'
న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా-భారత్ జట్ల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్లో ఇరు జట్ల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం అంతా ఇంతా కాదు. ఒకవైపు డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదంపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను చీటర్ అని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానిస్తే, ఒక క్యాచ్ విషయంలో భారత ఆటగాడు మురళీ విజయ్ ని మోసగాడు అంటూ స్మిత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరులో రెండో టెస్టులో మొదలైన వివాదం చివరి మ్యాచ్ వరకూ కొనసాగింది.
అయితే ప్రస్తుతం ఆ వివాదాల్నిపక్కకు పెట్టిన ఆసీస్-భారత క్రికెటర్లు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్కు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే రైజింగ్ పుణే సూపర్ జెయింట్ కెప్టెన్‌గా ఎంపికైన స్మిత్ తో పాటు ఆ జట్టులోని సభ్యుడిగా ఉన్న అజింక్య రహానేలు టీమ్ జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుతూ తాము మంచి స్నేహితులమని పేర్కొన్నారు. తామిద్దరం ఒకరికొకరు గ్రేట్ ఫ్రెండ్స్ అని వారిద్దరూ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంచితే, ధర్మశాల టెస్టు ముగిశాక ఆసీస్ జట్టు తనను బీరు పార్టీకి రమ్మని పిలిచిన విషయంపై రహానే వివరణ ఇచ్చాడు. చివరి మ్యాచ్ ముగిశాక తనను బీరు పార్టీకి పిలిచిన మాట వాస్తవమన్నాడు. అయితే ఆ పార్టీకి తాను వెళ్లలేదని ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే పేర్కొన్నాడు.