
క్రికెట్‌లో విచిత్రమైన ఘటన. బ్యాట్స్‌మన్ ఒకే బంతికి రెండు విధాల అవుటయ్యాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విచిత్రమైన ఘటన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో చోటుచేసుకుంది. ఆంపైర్‌నే తికమకపెట్టిన బ్యాట్స్‌మన్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మీత్. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఏడాది పాటు దూరమవ్వడంతో లీగ్ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ ట్రెడెంట్స్ తరుపున స్మిత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం జమైకా తల్లావాస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మిత్ విచిత్రంగా వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మరో రెండు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా రస్సెల్ బౌలింగ్‌లో స్మిత్ లాంగాన్ మీదుగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న పావెల్ సునాయసంగా క్యాచ్ అందుకున్నాడు. ఇంతలోనే స్మిత్ బ్యాట్ వికెట్లను తాకడంతో హిట్ వికెట్ కూడా అయ్యాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ తికమకపడి చివరికి క్యాచ్ ఔట్‌గా డిక్లేర్ చేశాడు. టీవీ వ్యాఖ్యాతలు కూడా స్మిత్ రెండు విధాల ఔట్ అంటూ నవ్వుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో జమైకా తల్లావాస్‌పై బార్బొడోస్ జట్టు అతి కష్టం మీద రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మిత్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో స్మిత్ (63; 44 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ సెంచరీతో ఆకట్టుకోగా.. అనంతరం బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసి బార్బడోస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment