అతడు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్: స్టీవ్ స్మిత్
లండన్: టీమిండియా బౌలర్, సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పై ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాలపై స్మిత్ లండన్ లో మీడియాతో మాట్లాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10 లో పర్వుల్ క్యాప్ విన్నింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ కు అద్భుతమైన విజయాలు అందించాడని కొనియాడాడు. ఐపీఎల్ లాంటి ట్వంటీ20 ఫార్మాట్ లో ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కష్టమని, కానీ భువీ మాత్రం డెత్ ఓవర్స్ బౌలింగ్ స్పెషలిస్ట్ అని కితాబిచ్చాడు.
ఐపీఎల్-10 ఫైనల్లో ముంబై ఇండియన్స్ చేతిలో పరుగు తేడాతో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమని చెప్పిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. అంతర్జాతీయ క్రికెటర్ గా ఇలాంటి వాటిని అధిగమించి ముందుకు సాగాలని అభిప్రాయపడ్డాడు. ప్రతి టోర్నీని ఛాలెంజింగ్ గా తీసుకుని అంతర్జాతీయ ఆటగాళ్లు ముందుకు సాగుతారని, ఒత్తిడిని ఎలా జయిస్తారన్న ప్రశ్నకు ఇలా బదులిచ్చాడు. ఐపీఎల్‌లో ఆడటం ఎంతో కలిసొచ్చిందని, గత రెండేళ్ల కాలంలో ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు స్మిత్ చెప్పుకొచ్చాడు. జూన్ 1నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ లో పాల్గొనేందుకు ఆసీస్ జట్టు లండన్ చేరుకుంది.