సఫారీలకు మరో ఎదురుదెబ్బ | Steyn ruled out of World Cup, Hendricks named replacement | Sakshi
Sakshi News home page

సఫారీలకు మరో ఎదురుదెబ్బ

Published Tue, Jun 4 2019 5:40 PM | Last Updated on Tue, Jun 4 2019 5:46 PM

Steyn ruled out of World Cup, Hendricks named replacement - Sakshi

సౌతాంప్టాన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటికే రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌కు వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో దక్షిణాఫ్రికా అడుగుపెట్టినప్పటి నుంచి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో సహా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని స్టెయిన్ తన భుజానికి అయిన గాయం నుంచి ఎంతకీ కోలుకోపోవడంతో అతను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో హెండ్రిక్స్‌ను జట్టులో తీసుకున్నారు.  ఈ మేరకు హెండ్రిక్స్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు నుంచి పిలుపు అందింది.

ఈ వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. తొలుత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమి చవి చూసిన సఫారీలు.. ఆపై బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి పరాజయం చెందారు.  దాంతో బుధవారం భారత్‌తో జరుగనున్న మ్యాచ్‌ దక్షిణాఫ్రికాకు కీలకంగా మారింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టెయిన్‌ ఆడితే తమ బౌలింగ్‌ విభాగం బలంగా ఉండేదని మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ డుప్లెసిస్‌ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే భారత్‌తో మ్యాచ్‌ నాటికి స్టెయిన్‌ కోలుకుంటాడని దక్షిణాఫ్రికా యాజమాన్యం భావించినప్పటికీ అతను అర్థాంతరంగా టోర్నీ నుంచి వైదొలగడం ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ. ఇప్పటికే భారత్‌తో మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా పేసర్‌ లుంగి ఎన్‌గిడి గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement