తొడకొట్టిన టైటాన్స్
♦ సత్తా చాటిన తెలుగు జట్టు
♦ బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం
♦ ప్రొ కబడ్డీ లీగ్
సాక్షి, హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు సొంతగడ్డపై రెండో రోజు అద్భుతంగా ఆడి అలరించింది. ఏకపక్షంగా సాగిన పోరులో 16 పాయింట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 44-28తో బెంగాల్ వారియర్స్‌పై ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల విరామం తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది.
ఆది నుంచి దూకుడుగా: టాస్ గెలిచిన బెంగాల్ కోర్టును ఎంచుకుంది. ఆరంభంనుంచే దూకుడు ప్రదర్శించిన టైటాన్స్ వరుసగా పాయింట్లు సాధించి ఒక దశలో 7-1తో ముందంజ వేసింది. ఆ తర్వాత కూడా రాహుల్, దీపక్ రైడింగ్‌లో చెలరేగడంతో టైటాన్స్ జోరు ఎక్కడా తగ్గలేదు. మరో వైపు బెంగాల్ పదే పదే సబ్‌స్టిట్యూట్‌లను మార్చినా ఫలితం రాబట్టలేకపోయింది. ఆరో నిమిషంలోనే టైటాన్స్ తొలి ఆలౌట్ నమోదు చేసింది. తొలి అర్ధ భాగం ముగిసే సరికి తెలుగు టీమ్ 27-9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. తొలి అర్ధ భాగంలోనే ప్రత్యర్థిని టైటాన్స్ రెండు సార్లు ఆలౌట్ చేయడం విశేషం.
చెలరేగిన మహేంద్ర: రెండో అర్ధభాగంలో వారియర్స్ కోలుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా జంగ్ కున్ లీ, మహేంద్ర గణేశ్ వరుస పాయింట్లు రాబట్టగా, విజిన్ సూపర్ ట్యాకిల్‌తో బెంగాల్ పుంజుకుంది. మరో వైపు రాహుల్ చౌదరి 35వ నిమిషంలో ఒకే రైడ్‌లో 3 పాయింట్లు రాబట్టగా... దీపక్, సుకేశ్ రాణించడంతో తెలుగు టీమ్‌కు సమస్య లేకుండా పోయింది.
తారల సందడి
హైదరాబాద్‌లో రెండో రోజు కబడ్డీ మ్యాచ్‌లకు భారీగా తారలు తరలివచ్చారు. వెంకటేశ్, మంచు లక్ష్మీ తొడగొట్టారు. అల్లరి నరేశ్‌తో పాటు పలువురు సినీ నటులు వచ్చారు. బ్యాడ్మింటన్ క్రీడాకారులు సింధు, కశ్యప్, శ్రీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
బెంగాల్ వారియర్స్ ఁ బెంగళూరు బుల్స్
రాత్రి గం. 8.00 నుంచి
తెలుగు టైటాన్స్ ఁ పట్నా పైరేట్స్
రాత్రి గం. 9.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం