ఫైనల్లో భారత్
జొహార్ బహ్రూ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహర్ కప్ అండర్-21 హాకీ టోర్నీలో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో దూసుకెళుతున్న ఆటగాళ్లు గురువారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లోనూ ఇదే జోరును చూపారు. తమన్ దయా హాకీ స్టేడియంలో దక్షిణ కొరియాతో జరిగిన ఈ మ్యాచ్‌ను భారత్ 6-1 తేడాతో గెలుచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని భారత్‌కు ఇది నాలుగో విజయం. దీంతో మొత్తం 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది.
ఆదివారం జరిగే ఫైనల్లో భారత జట్టు ఆతిథ్య మలేసియాను ఢీకొంటుంది. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలోనే అమిత్ రోహిదాస్ గోల్ చేయగా 9వ నిమిషంలో సత్బార్ సింగ్, 31వ నిమిషంలో తల్వీందర్ సింగ్ చేసిన గోల్స్‌తో ప్రథమార్థంలోనే భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మ్యాచ్ చివర్లో కుర్రాళ్లు రె చ్చిపోయారు. అమోన్ మిరాష్ టికే (57వ నిమిషం), రామదీప్ సింగ్ (62), అఫాన్ యూసుఫ్ (65) గోల్స్ కొట్టడంతో భారత్ విజ యం ఖరారైంది. కొరియా నుంచి యు స్యూంగ్ జు 34వ నిమిషంలో గోల్ సాధించాడు. శనివారం జరిగే తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు మలేసియాను ఢీకొంటుంది.