
జొహర్ బారు (మలేసియా): వరుసగా నాలుగో విజయంతో భారత యువ జట్టు సుల్తాన్ జొహర్ కప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–4తో సంచలన విజయం సాధించింది. దీంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే అగ్రస్థానంలో నిలిచింది. ఆట మొదలైందో లేదో అప్పుడే ఆధిపత్యాన్ని మొదలుపెట్టింది భారత్. ఆరంభంలోనే పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ... ఐదో నిమిషంలోనే భారత్ ఖాతా తెరిచింది.
గుర్‌సాహిబ్జిత్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే భారత్ 4–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. హస్‌ప్రీత్ సింగ్ (11వ నిమిషంలో), మన్‌దీప్ మోర్ (14వ ని.), విష్ణుకాంత్ సింగ్ (15వ ని.), శిలానంద్ లక్రా (43వ ని.) తలా ఒక గోల్ చేశారు. రెండో క్వార్టర్లో భారత డిఫెన్స్ వైఫల్యంతో డామన్ స్టీఫెన్స్ (18వ ని.) ఆస్ట్రేలియాకు తొలి గోల్ అందించాడు. అతనే మళ్లీ 35వ, 59వ, 60వ నిమిషాల్లో మూడు గోల్స్ చేసినా ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. రేపు జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్... బ్రిటన్‌తో తలపడుతుంది. 13న ఫైనల్ జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment