నమ్మకం నిలబెట్టాలి | Sunil Gavaskar evaluating Sundar Raman's role in IPL scandal | Sakshi
Sakshi News home page

నమ్మకం నిలబెట్టాలి

Published Thu, Apr 10 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

నమ్మకం నిలబెట్టాలి

నమ్మకం నిలబెట్టాలి

గవాస్కర్ ముందున్న సవాల్
 షార్జాలో బుకీల బెడద ఎక్కువ
 స్పాన్సర్ల కోసం ఫ్రాంచైజీల తంటాలు
 మరో 6 రోజుల్లో ఐపీఎల్-7
 
 సునీల్ మనోహర్ గవాస్కర్ క్రికెటర్‌గా తన కెరీర్‌లో ఎన్నో అత్యుత్తమ మ్యాచ్‌లు ఆడారు. ఓపెనర్ స్థానంలో బరిలోకి దిగి ప్రత్యర్థులపై చెలరేగి తన జట్టుకు కొండంత అండగా నిలిచారు. సన్నీ జోరుతో ఆ తర్వాత మిడిలార్డర్‌పై భారం తగ్గేది. ఇతర సభ్యులు ప్రశాంతంగా తమ ఇన్నింగ్స్‌ను కొనసాగించేవారు.
 
 
  కెరీర్ ఆసాంతం భారత్ ఎవరికంటే తక్కువ కాదు అని నిరూపించేందుకు ఆయన ప్రయత్నించారు. ఇప్పుడు కార్యనిర్వాహకుడిగా ఆయన బరిలోకి దిగనున్నారు. గత ఆరేళ్లతో పోలిస్తే ఈసారి ఐపీఎల్‌ను మరింత విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత గవాస్కర్‌పై ఉంది.
 
 సాక్షి క్రీడా విభాగం
 ‘జూన్ 2న ఫైనల్ ముగిసిన తర్వాత ఐపీఎల్ అత్యుత్తమ క్రికెట్ చూపించింది అనే భావనే తప్ప అభిమానుల మదిలో మరో ఆలోచన రాకూడదు. వివాదాలు లేని లీగ్‌గా దీనిని నిర్వహించేందుకు నా తరఫు నుంచి పూర్తిగా శ్రమిస్తాను’ అబుదాబిలో ఐపీఎల్ గురించి ప్రకటన చేస్తూ గవాస్కర్ చేసిన వ్యాఖ్య ఇది. ఆటగాడిగా, కెప్టెన్‌గా, వ్యాఖ్యాతగా, కొన్నాళ్ల పాటు కోచ్‌గా కూడా పని చేసిన గవాస్కర్ ఒక అడ్మినిస్ట్రేటర్‌గా మాత్రం ఎన్నడూ వ్యవహరించలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సరికొత్త బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఏర్పడింది.
 
 కొత్త కొత్తగా...
 క్రికెట్ దిగ్గజంగా గుర్తింపు ఉన్నా... రిటైర్ అయిన 27 ఏళ్ల తర్వాత కూడా పాలనా పరమైన వ్యవహారాల్లో మాత్రం సన్నీకి ఉన్న అనుభవం తక్కువ. సుప్రీంకోర్టు సూచించింది కాబట్టి ఆయన బాధ్యత చేపట్టారే తప్ప స్వచ్ఛందంగా కాదు. ఒడ్డున కూర్చొని వ్యాఖ్యలు చేసేవాళ్లు నీళ్లలోకి దిగితే కాని లోతు తెలీదు. ఇంత కాలం ఆయన చేసిందదే. కాబట్టి ఐపీఎల్ నిర్వహణ అంత సులభమైన వ్యవహారం కాదు. బోర్డులో అందరూ అండగా నిలుస్తారని... పైగా ఐపీఎల్‌కు గవర్నింగ్ కౌన్సిల్ ఉంది కాబట్టి సన్నీకి పెద్దగా బాధ్యత ఉండకపోవచ్చు అని కూడా వినిపిస్తోంది.
 
  అయితే ఇప్పుడు అందరి దృష్టిలో ఐపీఎల్ అంటే గవాస్కర్ మాత్రమే. అందులో ఎలాంటి మంచి జరిగినా, చెడు జరిగినా పేరు ఆయనకే. పైగా సుప్రీం కోర్టు ఒక పెద్ద బాధ్యతను నమ్మకంతో అప్పజెప్పింది కాబట్టి దానిని నిలబెట్టుకోవాల్సింది కూడా గవాస్కరే. ఈ ప్రయత్నంలో సన్నీ తొలి అడుగే తప్పుగా వేశారు. రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌లను జైపూర్‌లో నిర్వహించకుండా అహ్మదాబాద్‌కు తరలించి పక్కా బీసీసీఐ ప్రతినిధిలాగే పని చేశారు. మున్ముందు ఇలాంటివి జరగకుండా ఆయన పని చేయాలి.
 
 ఫిక్సింగ్ కోటలో...
 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ మొదటి దశ మరో దేశంలో నిర్వహించాల్సి వచ్చింది. అయితే దీనికి వేదికగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని ఎంచుకోవడమే ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ ఫిక్సింగ్‌లకు అడ్డా అయిన షార్జాలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిక్సింగ్ ఆరోపణలతోనే భారత్ 2000 తర్వాత అక్కడ వన్డే మ్యాచ్‌లు ఆడటం మానేసింది.
 
 ఆ తర్వాత ఆరేళ్లకు అబుదాబిలో మరో రెండు వన్డేలు ఆడటం మినహా టీమిండియా అటువైపు తిరిగి చూడలేదు. కానీ ఐపీఎల్ పుణ్యమా అని ఇప్పుడు మనవాళ్లు అక్కడ అడుగు పెడుతున్నారు. ఫిక్సింగ్ ఆరోపణలతో అతలాకుతలమైన మరుసటి ఏడాదే షార్జాలాంటి చోట్ల మ్యాచ్‌లకు సిద్ధం కావడం కత్తి మీద సాములాంటిదే. ఇందుకోసం సన్నీ బృందం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘ఎలాంటి సమస్యలు రాకుండా ఐపీఎల్ నిర్వహించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని స్థానిక పోలీసులతో పాటు ఐసీసీ అధికారులు కూడా మాకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా యూఏఈ ప్రభుత్వం ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది’ అని గవాస్కర్ వెల్లడించారు. నిజంగా ఎలాంటి బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఐపీఎల్ పారదర్శకంగా జరిగితే సన్నీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది.
 
 స్పాన్సర్లు ఎటు వైపు...
 ఐపీఎల్ ఆరంభానికి వారం రోజుల ముందు వరకు కూడా ఐదు జట్లు తమ ప్రధాన స్పాన్సర్లతో ఒప్పందానికి రాలేకపోయాయి. లీగ్‌కు వచ్చిన చెడ్డ పేరు లేదా తొలి దశ మ్యాచ్‌లు బయట జరుగుతుండటం కూడా దీనికి కారణం కావచ్చు. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించగానే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో తమ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించుకోరాదని ‘లక్స్ కోజి’ నిర్ణయించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ జట్లను స్పాన్సర్ చేసేందుకు ఎవరూ అమితాసక్తి చూపించడం లేదు.
 
 
 లీగ్‌లో వివాదాలు కూడా కారణం కావచ్చు. ‘అనూహ్యంగా ప్రతీ ఒక్కరు బేరమాడుతున్నారు. స్పాన్సర్‌షిప్ మొత్తాలను భారీగా తగ్గించాల్సి రావచ్చు’ అని ఒక జట్టు సీఈఓ వెల్లడించారు. ఆటగాళ్ల జెర్సీల ముందు భాగంలో కనిపించే ప్రధాన స్పాన్సర్‌షిప్ కోసం కూడా పెద్దగా పోటీ లేదు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో కొనసాగరాదని నిర్ణయించుకున్నట్లు ‘ముత్తూట్ ఫైనాన్స్’ ప్రకటించింది.
 
 రాజస్థాన్ రాయల్స్‌తో సుదీర్ఘ అనుబంధాన్ని ‘అల్ట్రాటెక్ సిమెంట్’ తెంచేసుకుంది. ఒక జట్టు టీ షర్ట్‌పై కనీసం ఆరు రకాల ప్రకటనలను ప్రదర్శించే అవకాశం ఉంది. మ్యాచ్‌లకు సమయం చేరువైనా పంజాబ్ జట్టు ఈ ఆరింటిలో ఒక్కదానికీ స్పాన్సర్‌ను తెచ్చుకోలేకపోయిందంటే పరిస్థితి అర్థమవుతోంది. ‘మా ఉత్పత్తులకు విదేశాల్లో ప్రచారం కోరుకోవట్లేదు. టీవీల్లో లోగో కనిపించడం వేరు. ప్రధానంగా స్థానిక మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొనే మేం స్పాన్సర్ చేస్తాం’ అని ఒక వ్యాపార సంస్థ ప్రతినిధి చెప్పారు. అయితే చాలా జట్లు తొలి మూడు ఐపీఎల్‌లు... ఆ తర్వాతి మూడు ఐపీఎల్‌ల చొప్పునే ఒప్పందం కుదుర్చుకున్నాయి.      
 
 
 చీర్ లీడర్స్ ఉన్నట్లే (నా)
 కొన్నాళ్ల క్రితం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జగ్మోహన్ దాల్మియా ఐపీఎల్‌ను బాగు చేస్తామంటూ ఎన్నో కొత్త కొత్త వాగ్ధానాలు, సూచనలు చేశారు. అందులో భాగంగా చీర్ గర్ల్స్‌ను కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. కానీ ఎంత గొప్పగా దాని గురించి చెప్పారో ఇప్పుడు అంతే వేగంగా తమ నిర్ణయంపై వెనక్కి మళ్లినట్లుంది.
 
 మీ చీర్ గర్ల్స్‌ను సిద్ధం చేసుకోండంటూ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు నిర్వాహకుల నుంచి సమాచారం కూడా వెళ్లిపోయింది. దీనిని రెండు జట్ల యజమానులు ధ్రువీకరించారు. ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిశ్వాల్ అయితే దీనిపై మరీ ఆశ్చర్యంగా స్పందించారు. ‘అసలు ఐపీఎల్‌లో చీర్ లీడర్స్‌ను ఎప్పుడూ నిషేధించారు’ అని ఆయన ప్రశ్నించడాన్ని చూస్తే ఈసారి కూడా చిందులు తప్పవేమో అనిపిస్తోంది. అయితే యూఏఈ చట్టాలు చీర్‌గర్ల్స్ నృత్యాలను అనుమతిస్తాయో లేదో మ్యాచ్ జరిగే వరకు చెప్పలేం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement