
రాజస్తాన్ రాయల్స్ స్వయంకృతంతో రెండో క్వాలిఫయర్‌కు అర్హత పొందే అవకాశాన్ని చేజార్చుకుంది. ఎలిమినేటర్‌లో రాయల్స్ తుది జట్టు కూర్పు ఏమాత్రం బాగోలేదు. బట్లర్, స్టోక్స్ వెళ్లాక వారి స్థానాల్ని భర్తీచేసే ఆటగాళ్లను కనిపెట్టలేకపోవడం జట్టును బలహీనం చేసింది. నాలుగైదు స్థానాల్లో రాయల్స్ ఎంచుకున్న క్లాసెన్, స్టువర్ట్ బిన్నీలు ఏ మాత్రం అర్హులు కాని ఆటగాళ్లనే చెప్పాలి. వాళ్లిద్దరు లోయర్ ఆర్డర్‌కు పనికొస్తారు. ఇన్నింగ్స్‌ను నడిపించిన రహానే ఔటయ్యాక... తర్వాత ఐదు ఓవర్లలో రాజస్తాన్ కేవలం 25 పరుగులే చేయగల్గింది. ఇది కోల్‌కతాను పుంజుకునేలా చేసింది. కుల్దీప్ స్పిన్ అద్భుతం. చివరకు 25 పరుగుల పెద్ద తేడాతోనే రాయల్స్ మూల్యం చెల్లించుకుంది. ఐపీఎల్ ఆసాంతం ఆడే ఆటగాళ్లనే ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోవాలి. ప్లేఆఫ్స్‌కు బట్లర్, స్టోక్స్‌లు అందుబాటులో ఉండరని తెలిసి వారినే ఆరంభం నుంచి ఆడించి మిగతా వారికి అరకొర చాన్స్‌లివ్వడం జట్టు మేనేజ్‌మెంట్ తప్పిదం. నిజానికి ఆటగాళ్ల వేలానికి ముందే ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించాలి. అప్పుడైతే పూర్తిగా అందుబాటులో ఉన్న ఆటగాళ్లనే తీసుకునేందుకు ఫ్రాంచైజీలకు అవకాశముంటుంది.
కోల్‌కతా కెప్టెన్‌గా ఈ సీజన్‌లో దినేశ్ కార్తీక్ అపార నైపుణ్యం కనబరిచాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని, అంచనాల్ని ఏ దశలోనూ వమ్ము చేయలేదు. రాయల్స్ ఆరంభంలోనే కీలక వికెట్లను తీయడంతో పీకల్లోతు కష్టాల్లో పడిన నైట్‌రైడర్స్‌ను నడిపించిన తీరు అద్భుతం. నిలకడగా నిలబడటంతో పాటు రన్‌రేట్‌నూ పెంచే ప్రయత్నం చేశాడు. రసెల్ వీరవిహారం జట్టుకు అదనపు బలాన్నిచ్చింది. ఇక క్వాలిఫయర్–2 కోసం సన్‌రైజర్స్ కాస్త ఎక్కువే కష్టపడాలి. ఎందుకంటే వరుసగా గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈ జట్టు పరాజయాల పరంపరకు బ్రేక్ వేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాలి. రషీద్ ఖాన్, బ్యాటింగ్‌లో కేన్ విలియమ్సన్ ఇప్పటిదాకా రాణించారు. వీరు విఫలమైతే సన్‌రైజర్స్ ఫైనల్ బెర్త్‌ను వదులుకోవాల్సిందే. కోల్‌కతా సొంత ప్రేక్షకుల మద్ధతుతో మరో విజయంపై దృష్టి పెట్టడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment