
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి ఎం.ఎస్. ధోని రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత తొలిసారి బహిరంగంగా తన అసహనాన్ని ప్రదర్శించాడు. బ్యాట్స్‌మన్ రనౌటయ్యే అవకాశం లేకున్నా షేన్ వాట్సన్ అనవసర త్రో కారణంగా రెండో పరుగు కూడా రావడంతో రాజస్తాన్ విజయం ఖాయమైంది. బట్లర్ అసాధారణ ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌కు అద్భుత విజయం అందించాడు. వాట్సన్ నుంచి అనవసర త్రోలు రావడం ఇది తొలిసారేం కాదు. 2014లో రాజస్తాన్‌కు ఆడుతున్న సమయంలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ వాట్సన్ ఇలాగే చేశాడు. ఆ మ్యాచ్‌లో వాట్సన్ ఓవర్‌త్రో కారణంగా ముంబైకి రెండు పరుగులు వచ్చాయి.
ఆ తర్వాత ఫాల్క్‌నర్ వేసిన ఆఖరి బంతిని ఆదిత్య తారే సిక్సర్‌గా మలిచి ముంబై ఇండియన్స్‌ను గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు కోచ్‌గా ఉన్న ద్రవిడ్ కూడా వాట్సన్ చర్యకు కోపగించుకొని డగౌట్‌లో తన టోపీని నేల కేసి విసిరి కొట్టాడు. ఒక మ్యాచ్‌లో చేసిన పొరపాట్లను తెలుసుకొని వాటిని తదుపరి మ్యాచ్‌లో పునరావృ తం చేయకుండా ఆడటం క్రికెట్‌లో కీలకం. గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయాన్ని మర్చిపోయి నేడు సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌పై చెన్నై దృష్టి పెట్టాలి. ధావన్, విలియమ్సన్ అద్భుత ఆటతీరుతో ఢిల్లీపై రైజర్స్ సూపర్ ఛేజింగ్ చేసింది. ధోనికి మళ్లీ కోపం రాకూడదంటే చెన్నై బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసి సన్‌రైజర్స్‌పై విజయాన్ని అందించాలి.
Comments
Please login to add a commentAdd a comment