
సునీల్, హర్మన్‌ప్రీత్‌లకు ‘ఆసియా’ అవార్డులు
మస్కట్: భారత హాకీ ఆటగాళ్లు ఎస్.వి.సునీల్, హర్మన్‌ప్రీత్ సింగ్ ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్) అవార్డులు అందుకున్నారు. స్టార్ ఫార్వర్డ్ ఎస్.వి.సునీల్‌కు సీనియర్ కేటగిరీలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’, యువ డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు ‘ప్రామిసింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు లభించాయి. 2016లో వీరిద్దరూ కనబరిచిన ప్రదర్శనకు గాను ఈ అవార్డులు దక్కాయి.
గతేడాది లక్నోలో ముగిసిన జూనియర్ ప్రపంచకప్‌లో యువ భారత్ టైటిల్ గెలవడంలో హర్మన్‌ప్రీత్ కీలకభూమిక పోషించాడు. లండన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ ట్రోఫీలో సునీల్ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో భారత్ రజతం గెలిచిన సంగతి తెలిసిందే. హాకీ ఇండియా (హెచ్‌ఐ) సీఈఓ ఎలీనా నార్మన్‌కు ఏహెచ్‌ఎఫ్ మెరిట్ అవార్డు లభించింది.