
‘సూపర్–4’ చివరి మ్యాచ్‌లో 7–0 గోల్స్ తేడాతో చైనాపై విజయం
రాజ్‌గిర్ (బిహార్): ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా ముందంజ వేసే స్థితిలో బరిలోకి దిగిన టీమిండియా భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ‘సూపర్–4’ ఆఖరి పోరులో శనివారం భారత్ 7–0 గోల్స్ తేడాతో చైనాను చిత్తుచేసింది.
భారత్ తరఫున అభిషేక్ (46వ, 50వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో సత్తా చాటగా... శిలానంద్ లక్డా (4వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (7వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (18వ నిమిషంలో), రాజ్ కుమార్ పాల్ (37వ నిమిషంలో), సుఖ్‌జీత్ సింగ్ (39వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు.
‘సూపర్–4’ దశ ముగిసేసరికి భారత్ 7 పాయింట్లతో పట్టిక అగ్ర స్థానంలో నిలవగా... డిఫెండింగ్ చాంపియన్ కొరియా 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం టైటిల్ సమరం జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది. మూడో స్థానం కోసం మలేసియాతో చైనా తలపడుతుంది.
చైనాతో పోరులో టీమిండియా పూర్తి ఆధిపత్యం కనబర్చింది. భారత స్ట్రయికర్ల ధాటికి చైనా ప్లేయర్లు ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థికి ఒక్క పెనాల్టీ కార్నర్ అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిమిషంలో శిలానంద్ గోల్‌తో ఖాతా తెరిచిన భారత్... ఇక చివరి వరకు అదే జోరు కొనసాగించింది. మరో మ్యాచ్‌లో కొరియా 4–3 గోల్స్ తేడాతో మలేసియాపై గెలిచింది.