
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ పదును పెరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను సమష్టిగా దెబ్బకొట్టింది. బ్యాటింగ్‌లోనూ సత్తాచాటడంతో లీగ్‌లో హైదరాబాద్ మూడో విజయం సాధించింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ఢిల్లీని సొంత గడ్డపై ఉక్కిరిబిక్కిరి చేసింది.
న్యూఢిల్లీ: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో మూడోసారి ‘విన్’ రైజర్స్ అయింది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. రైజర్స్ బౌలర్లు అందరూ వికెట్లు పడగొట్టారు. మొహమ్మద్ నబీ (2/21) కీలక వికెట్లను తీశాడు.
తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. బెయిర్‌స్టో (28 బంతుల్లో 48; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు బెయిర్‌స్టోకు దక్కింది. రైజర్స్ మార్పుల్లేని జట్టుతో బరిలోకి దిగగా... ఢిల్లీ మూడు మార్పులు చేసింది. వరుసగా విఫలమవుతున్న హనుమ విహారితో పాటు హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లను తప్పించి ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, రాహుల్ తేవటియాలను తుదిజట్టులోకి తీసుకుంది.
రాణించిన శ్రేయస్
టాస్ నెగ్గిన హైదరాబాద్ ఫీల్డింగ్‌కే మొగ్గుచూపడంతో ముందుగా ఢిల్లీ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే నిలబడ్డాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ తమకు పట్టనట్లే బ్యాటింగ్‌కు దిగారు. మిడిలార్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. రిషభ్ పంత్ (5), రాహుల్ తేవటియా (5), ఇంగ్రామ్ (5) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఓ సిక్స్, ఫోర్‌తో టచ్‌లోకి వచ్చి మోరిస్ (15 బంతుల్లో (17)కు భువీ చెక్ పెట్టాడు. టెయిలెండర్లలో అక్షర్ (13 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపులతో మూడంకెల స్కోరు దాటింది. లేదంటే వందలోపు స్కోరుకే పరిమితమయ్యేది.
రాణించిన బౌలర్లు
ఆడుతున్నది సొంతగడ్డపైనే అయినా... ప్రేక్షకుల మద్దతు తమకే ఉన్నా క్యాపిటల్స్ మాత్రం నిరాశపరిచింది. మూడో ఓవర్లో మొదలైన వికెట్ల పతనం 20 ఓవర్ దాకా క్రమం తప్పకుండా సాగింది. మొదట పృథ్వీ షా (11)ను భువనేశ్వర్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆరో ఓవర్ వేసిన మొహమ్మద్ నబీ మరో ఓపెనర్ ధావన్ (12) పనిపట్టాడు. మళ్లీ ఇన్నింగ్స్ పదో ఓవర్ తొలి బంతికే హిట్టర్ రిషభ్ పంత్‌ను కూడా నబీ ఔట్ చేయడంతో ఢిల్లీకి పరుగులు, మెరుపులు కరువయ్యాయి. ఇదీ చాలదన్నట్లు రెండు మూడు ఓవర్లకు ఓ వికెట్ కూలడం ఢిల్లీని కట్టేసింది. నబీతో పాటు భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్ తలా 2 వికెట్లు తీశారు. రషీద్ ఖాన్, సందీప్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.
వార్నర్ విఫలం
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు బెయిర్ స్టో, వార్నర్ (10) శుభారంభాన్నిచ్చారు. తన సహజ శైలికి భిన్నంగా వార్నర్ ఆడాడు. ధాటిగా ఆడుతున్న బెయిర్ స్టోకు అండగా నిలిచాడు. స్ట్రోక్ ప్లేతో ఆకట్టుకున్న బెయిర్ స్టో బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో హైదరాబాద్ పవర్ ప్లేలోనే లక్ష్యానికి అవసరమైన సగం (62) పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే బెయిర్ స్టో ఆటకు తెరపడింది. కాసేపటికే వార్నర్ కూడా ఔటైనప్పటికీ విజయ్ శంకర్ (16; 1 ఫోర్), మనీశ్ పాండే (10) పదుల పరుగులతోనే సన్‌రైజర్స్ వంద పరుగులకు చేరుకుంది. వాళ్లిద్దరితో పాటు దీపక్ హుడా (10) ఔటయ్యాక మిగతా లాంఛనాన్ని నబీ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), యూసుఫ్ పఠాన్ (9 నాటౌట్) పూర్తి చేశారు. క్యాపిటల్స్ బౌలర్లలో రబడ, లమిచానే, అక్షర్, తేవటియా, ఇషాంత్ తలా ఒక వికెట్ తీశారు.
బెయిర్‌స్టో క్యాచ్ పట్టి ఉంటే...
స్వల్ప లక్ష్యమే అయినా బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్ తడబాటు కనిపించింది. పిచ్ మరీ మందకొడిగా ఉండటంతో పాటు అక్షర్, తేవటియా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రైజర్స్ ఇబ్బంది పడింది. వార్నర్‌లాంటి హిట్టర్ కూడా ఒక్క బౌండరీ లేకుండా 18 బంతుల్లో 10 పరుగులు చేశాడంటే పరిస్థితి అర్థమవుతోంది. అలాంటి చోట బెయిర్‌స్టో ఇన్నింగ్స్ విలువేంటో అర్థమవుతుంది. అతని దూకుడైన ఆరంభం వల్లే హైదరాబాద్ విజయం సాధించగలిగిందనడంలో సందేహం లేదు.
అయితే అతను 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు అక్షర్ పటేల్ తన తొలి ఓవర్లోనే రిటర్న్ క్యాచ్‌ను వదిలేశాడు. బెయిర్‌స్టో ముందుకొచ్చి షాట్ ఆడగా చురుగ్గానే స్పందించిన అక్షర్ రెండు చేతులతో బంతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే చేతుల్లోకి వచ్చిన బంతి దురదృష్టవశాత్తూ జారిపోయింది. దాంతో అక్షర్ తీవ్రంగా నిరాశ చెందాడు. అక్కడే బెయిర్‌స్టో ఔటై ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో!
Comments
Please login to add a commentAdd a comment