ఐపీఎల్ ఉన్నంత కాలం ఈ రికార్డు పదిలం! | Sunrisers Hyderabad beats Gujarati Lions every time | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ ఉన్నంత కాలం ఈ రికార్డు పదిలం!

Published Sun, May 14 2017 12:00 PM | Last Updated on Tue, Aug 21 2018 2:46 PM

ఐపీఎల్ ఉన్నంత కాలం ఈ రికార్డు పదిలం! - Sakshi

ఐపీఎల్ ఉన్నంత కాలం ఈ రికార్డు పదిలం!

కాన్పూర్‌: ఐపీఎల్‌–2017లో భాగంగా గుజరాత్ లయన్స్‌పై నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. నిన్న (శనివారం) జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో గుజరాత్‌ లయన్స్‌ను చిత్తుగా ఓడించి అరుదైన రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్‌లో తలపడ్డ ప్రతీసారి ఓ ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించిన తొలి జట్టుగా డేవిడ్ వార్నర్ సేన చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ ఐదుసార్లు గుజరాత్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ కు ఒక్క ఓటమి లేకపోవడం విశేషం.

శనివారం మ్యాచ్‌తో గుజరాత్‌పై తమ గెలుపోటముల రికార్డును 5-0తో మెరుగు పరుచుకుంది. కాగా, 2016లో కొత్త జట్లుగా గుజరాత్, పుణే జట్లు వచ్చాయి. ఆ సీజన్లో మూడుసార్లు తలపడగా అన్ని పర్యాయాలు హైదరాబాద్‌నే విజయం వరించింది. ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు నెగ్గింది. శనివారంతో గుజరాత్ కథ ముగిసింది. వచ్చే సీజన్లో గుజరాత్, పుణే జట్లు కనిపించవన్న విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ లయన్స్ చేతిలో ఏ విధంగానూ సన్ రైజర్స్ ఓటమి చవిచూసే అవకాశం లేదు. బహుశా ఇలాంటి రికార్డు ఏ జట్టుకు సాధ్యమయ్యే అవకాశం లేదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండు సీజన్లలో కలిపి మొత్తం 30 మ్యాచ్‌లు ఆడిన లయన్స్‌ 13 గెలిచి 16 ఓడగా, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2016లో 9 మ్యాచ్‌లు గెలిచి నంబర్‌వన్‌గా ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించిన లయన్స్‌... ఈసారి కేవలం 4 విజయాలు సాధించి ఏడో స్థానంతో ముగించింది. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ 19.2 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌట్ కాగా, కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ (52 బంతుల్లో 69 నాటౌట్‌; 9 ఫోర్లు), విజయ్‌ శంకర్‌ (44 బంతుల్లో 63 నాటౌట్‌; 9 ఫోర్లు) రాణించడంతో 18.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్‌ బౌలర్ సిరాజ్‌ (4/32) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement