సిద్ధార్థ్ కౌల్ , కేన్ విలియమ్సన్
లక్ష్యం చిన్నదైనా... పెద్దదైనా కానీయండి. ఆఖరి 12 బంతుల్లో 27 పరుగులు చేయడం చేతిలో 6 వికెట్లున్న జట్టుకు కష్టమో అసాధ్యమో కానే కాదు. కానీ హైదరాబాద్ బౌలర్లు... అది అసాధ్యమేనని చేతల్లో చూపెట్టారు. సిద్ధార్థ్ కౌల్ 19వ ఓవర్లో కేవలం 6 పరుగులివ్వడం, రాజస్తాన్ చివరి ఓవర్లో 9 పరుగులే చేయడం రైజర్స్ మ్యాజిక్‌కు నిదర్శనం.
జైపూర్: మళ్లీ బౌలింగే సన్‌రైజర్స్‌ను ‘విన్’రైజర్స్‌గా చేసింది. హైదరాబాద్ తక్కువ స్కోరు చేసినా గెలిచేందుకు ఊపిరి పోసింది. దీంతో ఐపీఎల్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేసిన మూడో మ్యాచ్‌లోనూ గెలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (43 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలెక్స్ హేల్స్ (39 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించారు. రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ (3/26) కట్టడి చేశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రహానే (53 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్), సంజూ శామ్సన్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం దుర్బేధ్యమైన రైజర్స్ బౌలింగ్ ముందు నిలువలేకపోయింది. సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు తీశాడు.
విలియమ్సన్, హేల్స్ నిలబడితే...
హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఆడింది ఇద్దరే. ఈ సీజన్‌లో తొలిమ్యాచ్ ఆడిన ఓపెనర్ హేల్స్, కెప్టెన్ విలియమ్సన్ క్రీజులో ఉన్నంతసేపు రాజస్తాన్ శిబిరంలో ఆందోళన పెరిగింది. ఆరంభంలోనే ధావన్ (6) విఫలమయ్యాక... మూడో ఓవర్ నుంచి 14వ (13.3) ఓవర్ వరకూ పది ఓవర్ల పాటు సన్‌రైజర్స్ బ్యాటింగ్ జోరు కొనసాగింది. హేల్స్ బౌండరీలతో కుదురుగా నిలకడను చూపిస్తే... కేన్ విలియమ్సన్ చూడచక్కని సిక్సర్లతో వేగం పెంచాడు. ఉనాద్కట్ వేసిన 12వ ఓవర్లో కేన్ రెచ్చిపోయాడు. 4, 6, 4, 2, 4, 1లతో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. దీంతో 32 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది.
ఆ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో మరో సిక్సర్ బాదాడు. ఇలా సాఫీగా... భారీ స్కోరు దిశగా సాగిపోతున్న ఈ ఇన్నింగ్స్ పతనం ఈ ఇద్దరు పెవిలియన్ చేరడంతో ప్రారంభమైంది. రెండో వికెట్‌కు 92 పరుగులు జోడించాక... 14వ ఓవర్లో కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో మొదట హేల్స్, ఇష్ సోధి వేసిన మరుసటి ఓవర్లో విలియమ్సన్ ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారెవరూ బాధ్యత తీసుకోలేదు. షకీబ్ (6), యూసుఫ్ పఠాన్ (2), రషీద్ ఖాన్ (1)లను ఔట్ చేసిన ఆర్చర్ రైజర్స్ స్కోరుకు కళ్లెం వేశాడు. దీంతో కీలకమైన డెత్ ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ కేవలం 42 పరుగులే చేయగలిగింది. గౌతమ్ 2, ఉనాద్కట్, ఇష్ సోధి చెరో వికెట్ తీశారు.
రహానే కడదాకా...
రాజస్తాన్ రాయల్స్ ముందున్న లక్ష్యం 152. టి20ల్లో ఇదేమంత కష్టం కాదు. కానీ... ఛేదించలేక రాయల్స్ చేతులెత్తేసింది. యువ బ్యాట్స్‌మన్ సంజూ శామ్సన్ మెరుపులు, రహానే ఓపెనర్‌గా వచ్చి కడదాకా చేసిన పోరాటం హైదరాబాద్ బౌలర్లను దాటివెళ్లలేకపోయింది. ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (4) పెవిలియన్ చేరడంతో వచ్చిన సంజూ... కెప్టెన్ రహానేతో కలిసి వేగంగా పరుగులు జత చేశాడు. 7 ఓవర్ల వ్యవధిలో వీరిద్దరు 59 పరుగులు జోడించారు. పదో ఓవర్లో శామ్సన్‌ను ఔట్ చేసిన సిద్ధార్థ్ కౌల్ ఈ జోడీని విడగొట్టాడు. తర్వాతి ఓవర్లో బెన్ స్టోక్స్‌ను యూసుఫ్ పఠాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.
అనంతరం వచ్చిన వారిలో బట్లర్ (10), మహిపాల్ లామ్రోర్ (11), గౌతమ్ (8) ఎవరూ గెలిపించేంత స్కోరు జతచేయలేకపోయారు. 42 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రహానే చివరి వరకు అజేయంగా నిలిచాడు. చివరి రెండు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సిన దశలో రాజస్తాన్‌ను లక్ష్యం ఊరించింది. కానీ 19వ ఓవర్లో సిద్ధార్థ్ కౌల్ 6 పరుగులే ఇచ్చి మహిపాల్ వికెట్ తీయడంతో గెలుపు మలుపు తీసుకుంది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 21 పరుగులు చేయడం రాయల్స్ వల్ల కాలేదు. సందీప్ శర్మ (1/15), రషీద్ ఖాన్ (1/31), బాసిల్ థంపి (1/26), యూసుఫ్ పఠాన్ (1/14) తలా ఒక వికెట్ తీసి రాయల్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టారు.
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హేల్స్ (సి) శామ్సన్ (బి) గౌతమ్ 45; ధావన్ (బి) గౌతమ్ 6; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) ఇష్ సోధి 63; మనీశ్ పాండే (సి) రహానే (బి) ఉనాద్కట్ 16; షకీబ్ (బి) ఆర్చర్ 6; పఠాన్ (సి) కులకర్ణి (బి) ఆర్చర్ 2; సాహా నాటౌట్ 11; రషీద్ ఖాన్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 1; బాసిల్ థంపి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151.
వికెట్ల పతనం: 1–17, 2–109, 3–116, 4–133, 5–137, 6–143, 7–150.
బౌలింగ్: గౌతమ్ 4–0–18–2, ధవల్ కులకర్ణి 2–0–20–0, ఆర్చర్ 4–0–26–3, ఉనాద్కట్ 3–0–33–1, ఇష్ సోధి 3–0–25–1, స్టోక్స్ 3–0–20–0, మహిపాల్ 1–0–8–0.
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 65; త్రిపాఠి (బి) సందీప్ 4; సంజూ శామ్సన్ (సి) హేల్స్ (బి) కౌల్ 40; స్టోక్స్ (బి) పఠాన్ 0; బట్లర్ (సి) ధావన్ (బి) రషీద్ ఖాన్ 10; మహిపాల్ (సి) సాహా (బి) కౌల్ 11; గౌతమ్ (సి) ధావన్ (బి) థంపి 8; ఆర్చర్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1–13, 2–72, 3–73, 4–96, 5–128, 6–139.
బౌలింగ్: సందీప్ శర్మ 4–0–15–1, షకీబ్ 4–0–30–0, బాసిల్ థంపి 2–0–26–1, సిద్ధార్థ్ కౌల్ 4–0–23–2, రషీద్ ఖాన్ 4–0–31–1, యూసుఫ్ పఠాన్ 2–0–14–1.
Comments
Please login to add a commentAdd a comment