కూతురితో వార్నర్
గత నాలుగేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. ఈ నాలుగేళ్లలోనూ ప్లే ఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్ ఒకసారి టైటిల్‌ను గెలవడంతో పాటు మరోసారి రన్నరప్‌గా నిలిచింది. అదృష్టం కలిసిరావడంతో ఈసారి కూడా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న సన్ జట్టు రాణించలేకపోయింది. బ్యాట్స్‌మన్, బౌలర్లు కీలక సమయంలో చేతులెత్తేయడంతో ఎలిమినేటర్స్‌తోనే లీగ్‌లో తన ప్రయాణాన్ని ముగించింది. అంతంతమాత్రంగానే ఉన్న బ్యాటింగ్ లైనప్‌తో సన్ ఇక్కడివరకు చేరడంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్ ప్రధాన పాత్ర పోషించారు. వీరితో పాటు ఈ సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శనను ప్రభావితం చేసిన అంశాలను కూలంకషంగా పరిశీలిద్దాం...
వార్నర్, బెయిర్‌స్టోనే వెన్నెముక
ఎలిమినేటర్స్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడటం హైదరాబాద్ యాజమాన్యాన్ని తీవ్రంగా బాధించి ఉండవచ్చు. ఎందుకంటే అదృష్టవశాత్తు ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న హైదరాబాద్ తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. లీగ్ చరిత్రలోనే కేవలం 12 పాయింట్లతో ఒక జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడం ఇదే తొలిసారి. మెరుగైన నెట్‌రన్‌రేట్ కారణంగా కేవలం ఆరు విజయాలే సాధించినప్పటికీ హైదరాబాద్‌కు అది సాధ్యమైంది. దీనికి కారణం వార్నర్, బెయిర్ స్టో జోడీ. సన్ సాధించిన మొత్తం పరుగుల్లో వీరిద్దరి వాటానే 61 శాతం కావడం జట్టు విజయాల్లో వీరి పాత్రను చూపిస్తోంది. వీరిద్దరూ ప్రపంచకప్ కోసం తమ దేశాలకు తిరిగి వెళ్లిన తర్వాత సన్ కనీసం ఒక్క మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకోలేకపోయింది.
భాగస్వామ్యమే నిలిపింది
సన్‌రైజర్స్ సాధించిన విజయాలన్నీ వార్నర్– బెయిర్ స్టో అద్భుత భాగస్వామ్యాల కారణంగా వచ్చినవే. లీగ్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 100కు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఈ జంట జట్టు విజయానికి బాటలు వేసింది. ఇందులో బెంగళూరుపై 185 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా ఉంది. ఈ సీజన్‌లో వీరిద్దరూ జంటగా 10 ఇన్నింగ్స్‌లలో 791 పరుగుల్ని జోడించారు. ఐపీఎల్‌లో ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా... టి20ల చరిత్రలో మూడో రికార్డు భాగస్వామ్యంగా నిలిచింది. ఈ సీజన్‌లో వార్నర్ 692 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో తొలి స్థానంలో ఉండగా... బెయిర్ స్టో 445 పరుగులతో పదో స్థానంలో నిలిచాడు.
రషీద్ మాయాజాలం
సన్‌రైజర్స్ విజయాల్లో కీలకంగా వ్యవహరించిన మరో ఆటగాడు రషీద్ ఖాన్. గతేడాదితో పోలిస్తే రషీద్ ఈ సీజన్‌లో రాణించలేదనేది పలువురి అభిప్రాయం. అయితే గణాంకాలు మాత్రం ఇది నిజం కాదంటున్నాయి. గతంతో పోలిస్తే వికెట్లు తీయడంలో వెనుకబడినప్పటికీ ఈసారి అతను మరింత పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈసీజన్‌లో 6.28 ఎకానమీతో 17 వికెట్లను రషీద్ దక్కించుకున్నాడు. 2018లో 21 వికెట్లు తీసిన రషీద్ 6.73 ఎకానమీని నమోదు చేశాడు. నిజం చెప్పాలంటే రషీద్ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తెలివిగా వ్యవహరించడం వల్లే అతని ప్రదర్శన కాస్త వెనకబడినట్లుగా సగటు ప్రేక్షకునికి అనిపిస్తోంది. ఈ మిస్టరీ బౌలర్ బౌలింగ్‌లో పరుగులు సాధించడం కంటే వికెట్‌ను కాపాడుకోవడానికే బ్యాట్స్‌మెన్ మొగ్గుచూపడంతో ఈసారి రషీద్ వికెట్ల సంఖ్య తగ్గింది.
ఆలస్యంగా తేరుకున్న మనీశ్‌పాండే
ప్రారంభ మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోని ఆల్‌రౌండర్ మనీశ్ పాండే... లీగ్ చివరి దశలో ఫామ్‌లోకి వచ్చాడు. బెయిర్ స్టో జట్టుకు దూరమయ్యాక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన పాండే విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. విజయ్ శంకర్ పరిస్థితి దీనికి భిన్నం. లీగ్ ఆరంభ మ్యాచ్‌ల్లో కొంత మెరుగ్గా ఆడిన విజయ్ శంకర్ కీలక మ్యాచ్‌ల్లో రాణించలేకపోయాడు. కేవలం 126.42 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు సాధించాడు. కేన్ విలియమ్సన్ ఒకటీఅరా మ్యాచ్‌ల్లో మినహా మునుపటి మెరుపులు మెరిపించలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్నా అతను తన ధాటిని ప్రదర్శించలేకపోయాడు. దీంతో ఓపెనింగ్ నుంచి తప్పుకుని వేరే స్థానంలో బరిలో దిగినా మెప్పించలేకపోయాడు. గతేడాది ఓపెనర్‌గా ఆడిన విలియమ్సన్ టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు జట్టును రన్నరప్‌గా నిలిపాడు.
రాణించని ఐదో బౌలర్
అఫ్గాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, మొహ్మమద్ నబీ... పేసర్లలో భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ తమ అద్భుత ప్రదర్శనలు నమోదు చేశారు. కానీ ఐదో బౌలర్‌గా తమకు వచ్చిన అవకాశాలను సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, బాసిల్ థంపి సమర్థంగా వినియోగించుకోలేకపోయారు. ఓవర్‌కు 8 పరుగులకు మించి ఇస్తూ ప్రత్యర్థికి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
మిడిలార్డర్ సమస్య
సన్‌రైజర్స్‌ను సీజన్ ఆసాంతం వేధించిన సమస్య మిడిలార్డర్ వైఫల్యం. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ అయిన మనీశ్ పాండే, విజయ్ శంకర్ మిడిలార్డర్‌లో రాణించలేకపోయారు. నం.3 స్థానంలో వీరిద్దరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడారు. యూసుఫ్ పఠాన్ ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 40 పరుగులు... దీపక్ హుడా 11 మ్యాచ్‌ల్లో 64 పరుగులతో చెత్త ప్రదర్శనను కనబరిచారు. చాలా ఆలస్యంగా అభిషేక్ శర్మను ఆడించినా అతనికి ఎక్కువ అవకాశాల్లేక కుదురుకోలేకపోయాడు. మిడిలార్డర్‌లో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ లేకపోవడం సన్‌ను దెబ్బతీసింది. మొహమ్మద్ నబీ 8 మ్యాచ్‌లలో 6.65 ఎకానమీతోనే పరుగులు ఇవ్వడంతో పాటు 151.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించి ఈ సీజన్‌లో రైజర్స్ ‘స్టార్’గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment