పొలార్డ్ , యువరాజ్, రోహిత్
సాక్షి, హైదరాబాద్: హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బృందం సొంతగడ్డపై మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరుగనున్న మ్యాచ్‌లో మాజీ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో రైజర్స్ తలపడనుంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించి మంచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్న ముంబై ఇండియన్స్... సన్‌రైజర్స్‌ను వారి సొంతగడ్డపై ఓడించాలనే పట్టుదలతో బరిలో దిగనుంది.
సమష్టిగా రాణిస్తోన్న సన్...
సీజన్ తొలి మ్యాచ్ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో సమష్టిగా రాణిస్తూ వరుస విజయాలు సాధించింది. గత సీజన్‌లో అన్నీ తానై జట్టును నడిపించిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ గైర్హాజరీలోనూ జట్టు విజయాలు సాధిస్తుండటం పరిశీలించాల్సిన అంశం. ఓపెనింగ్‌లో వార్నర్, బెయిర్ స్టో గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢిల్లీతో గురువారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్ స్వల్ప స్కోరుకే పరిమితమైనప్పటికీ... అతని అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. బెయిర్ స్టో జంటగా వార్నర్ తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ 100కు పైగా భాగస్వామ్యాలను నెలకొల్పాడు. వార్నర్ విఫలమైనప్పటికీ బెయిర్ స్టో చెలరేగడం సన్‌కు కలిసొచ్చే అంశం. వీరితో పాటు విజయ్ శంకర్ మంచి స్ట్రోక్ ప్లేతో అలరిస్తున్నాడు. మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, దీపక్ హుడా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఇదొక్కటే జట్టును కలవరపరిచే అంశం. విలియమ్సన్ జట్టుకు దూరం కావడంతో పేస్ బాధ్యతలతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా తలకెత్తుకున్న భువనేశ్వర్ మునుపటి ఫామ్‌ను అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో చివరి ఓవర్లలో భారీగా పరుగులు సమర్పిస్తూ వికెట్లు తీయడంలో ఇబ్బంది పడిన భువీ... ఢిల్లీతో మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన స్పెల్‌లో 27 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ భువీ తన స్థాయిని ప్రదర్శిస్తే సన్‌కు తిరుగుండదు. మరోవైపు స్పిన్ కేటగిరీలో అఫ్గాన్ ద్వయం రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ తమ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్ కూడా రాణిస్తుండటం సానుకూలాంశం.
శుక్రవారం వర్షం తర్వాత మైదానం పరిస్థితి
గెలుపే లక్ష్యంగా ముంబై
ఓవైపు సన్‌రైజర్స్ ప్రయాణం సాఫీగా జరుగుతోంటే, మరోవైపు ముంబై పరిస్థితి ఒకటి గెలిస్తే మరోటి ఓటమి అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన ముంబై రెండు విజయాలు, రెండు ఓటములతో గ్రూప్‌లో ఆరో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ మంచి బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న ముంబైని తక్కువ అంచనా వేయలేం. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఈ సీజన్‌లో తొలిసారిగా రోహిత్ సేన ఓటమి రుచి చూపించింది. చెన్నైపై గెలుపు ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్ యాదవ్‌తో ముంబై టాపార్డర్ పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురిలో ప్రతి మ్యాచ్‌లో కనీసం ఇద్దరు రాణిస్తున్నారు. హిట్టర్‌లతో కూడిన మిడిలార్డర్‌లో పొలార్డ్, కృనాల్, హార్దిక్ కేవలం ఓవర్ వ్యవధిలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సమర్థులు. చెన్నైపై హార్దిక్ చెలరేగిన తీరు అద్భుతం. వెటరన్ యువరాజ్ సింగ్ కూడా తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీతో తన విలువ చాటుకున్నాడు. వీరంతా చెలరేగితే సన్‌రైజర్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment