సూపర్... మేవెదర్ | Super ...Mayweather | Sakshi
Sakshi News home page

సూపర్... మేవెదర్

Published Mon, May 4 2015 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

సూపర్... మేవెదర్

సూపర్... మేవెదర్

అద్భుతమేమీ జరగలేదు. అనుభవమే గెలిచింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ ‘మెగా ఫైట్’లో పైచేయి సాధించాడు. ఫిలిప్పీన్స్ మేటి బాక్సర్ మ్యానీ పాకియోపై హోరాహోరీ పోరులో నెగ్గిన మేవెదర్ కెరీర్‌లో వరుసగా 48వ విజయంతో తన అజేయ రికార్డును కొనసాగించాడు. బాక్సింగ్ క్రీడా చరిత్రలోనే అత్యంత ఖరీదైన బౌట్‌గా నిలిచిన ఈ పోటీలో గెలవడం ద్వారా మేవెదర్ 18 కోట్ల డాలర్లు (రూ. 1147 కోట్లు), పాకియో 12 కోట్ల డాలర్లు (రూ. 764 కోట్లు) తమ ఖాతాలో వేసుకున్నారు.
 
 ‘మెగా ఫైట్’లో అమెరికా బాక్సర్‌దే గెలుపు
►  కెరీర్‌లో వరుసగా 48వ విజయం
►  పోరాడి ఓడిన పాకియో

 
లాస్‌వేగాస్ : ఇద్దరు బాక్సింగ్ దిగ్గజాల మధ్య జరిగిన పసందైన పోరులో అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫిలిప్పీన్స్ మేటి బాక్సర్ మ్యానీ పాకియోతో ఆదివారం జరిగిన వెల్టర్ వెయిట్ కేటగిరీ బౌట్‌లో మేవెదర్ పాయింట్ల పద్ధతిలో విజయాన్ని సాధించాడు. నిర్ణీత 12 రౌండ్ల అనంతరం బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు జడ్జిలు మేవెదర్‌కే (118-110, 116-112, 116-112 పాయింట్లు) అనుకూలంగా ఫలితాన్ని ప్రకటించారు.

ఈ గెలుపుతో 38 ఏళ్ల మేవెదర్ తన విజయాల రికార్డును 48-0తో మెరుగుపర్చుకున్నాడు. మరోవైపు 36 ఏళ్ల పాకియో కెరీర్‌లో ఆరో పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. బౌట్ మొత్తంలో మేవెదర్ 435 పంచ్‌లు విసరగా అందులో 148 పంచ్‌లు ప్రత్యర్థికి తగిలాయి. మరోవైపు పాకియో 429 పంచ్‌లు విసరగా అందులో 81 పంచ్‌లు మేవెదర్‌కు తగిలాయి. వీటి ఆధారంగానే మేవెదర్ విజయం ఖాయమైంది.

శతాబ్దపు పోరు’ గా ప్రచారం కల్పించిన ఈ బౌట్‌లో పాకియో నుంచి మేవెదర్‌కు ఆద్యంతం గట్టిపోటీనే ఎదురైంది. ఎడంచేతి వాటం బాక్సరైన పాకియో ఆరంభ రౌండ్లలో దూకుడుగా వ్యవహరించాడు. పలుమార్లు మేవెదర్‌పై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. కొన్నిసార్లయితే మేవెదర్ వీటి నుంచి తప్పించుకోవడానికి రింగ్‌లో ఓ మూలకు వెళ్లిపోయాడు. అయితే మేవెదర్ మాత్రం ఆచితూచిగా కదులుతూ అవకాశం దొరికినపుడల్లా పంచ్‌లు సంధించాడు.

మొత్తానికి బౌట్ చూసిన వారికి పాకియో ఆధిపత్యం చలాయించినట్లు కనిపించినా... పరిగణనలోకి తీసుకున్న పంచ్‌ల విషయంలో మా త్రం మేవెదర్ పైచేయి సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ బౌట్‌ను టీవీ ల్లో 40 కోట్ల మంది తిలకిం చారని అంచనా. ఈ ఫైట్‌ను చూసేందుకు చాలా మంది సెలబ్రిటీలు రావడంతో లాస్‌వేగాస్‌లోని విమానాశ్రయం ప్రైవేట్ జెట్ విమానాలతో నిండి పోయింది. ఫిలిప్పీన్స్‌లో పాకియో అభిమానుల కోసం  పలు స్టేడియాల్లో, వీధుల్లో పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. బౌట్ జరుగుతున్నంతసేపు మనీలా వీధులు అభిమానులతో నిండిపోయాయి.
 
 పాకియో బాక్సింగ్ శైలి విభిన్నంగా ఉంటుంది. అందుకే కొంత సమయం తీసుకొని అతణ్ని పరిశీలించాను. ఆ తర్వాత దూకుడు పెంచాను. అతని పోరాటపటిమ అమోఘం. పాకియో చాలా పంచ్‌లు విసిరినా అందులో చాలావరకు నాకు తగల్లేదు. సెప్టెంబరులో నా కెరీర్‌లో చివరి బౌట్‌లో తలపడతాను.     -మేవెదర్
 
 నిజానికి నేనే గెలిచానని అనుకున్నాను. అయితే రింగ్‌లో మేవెదర్ కదులుతున్నపుడు అతనిపై పంచ్‌లు సంధించడం కష్టం. ఒకేచోట ఉన్నపుడు అతనిపై పంచ్‌ల వర్షం కురిపించాను. భుజం నొప్పితోనే ఈ బౌట్ బరిలోకి దిగాను. నొప్పి నివారణకు ఇంజెక్షన్ తీసుకుంటానని కోరినా నిర్వాహకులు అంగీకరించలేదు.    -పాకియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement