నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌తో శిక్షణ ఇప్పిస్తాం
డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి టీజీఎస్పీ సిబ్బంది
కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో డీజీపీ జితేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం (టీజీఎస్పీ)లో అత్యుత్తమ శిక్షణ ఇచ్చే బాక్సింగ్, క్రికెట్ కేంద్రాలను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్పీ బెటాలియన్లలో శుక్రవారం జరిగాయి. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి జితేందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్, క్రికెట్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని చాటిన బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌లను టీజీఎస్పీ డీఎస్పీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. వారి ఆధ్వర్యంలో పోలీసులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు టీజీఎస్పీ విభాగంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
డ్రగ్స్ నిరోధంలోనూ టీజీఎస్పీ సేవలు
టీజీఎస్పీ సిబ్బందికి శాంతి భద్రతల పరిరక్షణలోనూ, ఇతర రాష్ట్రాలకు వెళ్లి సేవలు అందించటంలోనూ మంచి పేరుందని డీజీపీ ప్రశంసించారు. ప్రస్తుతం శిక్షణ పూర్తి చేసుకున్న టీజీఎస్పీ సిబ్బందిని మాదకద్రవ్యాలు, సైబర్ నేరాల నియంత్రణకు వాడుకొంటామని తెలిపారు. జిఆర్పీ, సీఐడీ విభాగాలలోను వీరి సేవలు వినియోగించుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,077 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చామని, యూసఫ్‌గూడ బెటాలియన్‌లో 548 మందికి శిక్షణ పూర్తయిందని వెల్లడించారు. పోలీస్ విభాగంలో చేరుతున్న యువ సిబ్బంది తల్లిదండ్రులు గర్వపడేలా, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చేలా పని చేయాలని సూచించారు.
టీజీఎస్పీ అదనరు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తిచేసుకున్న 4,077 కానిస్టేబుళ్లలో 2,746 గ్రాడ్యుయేట్లు, 596 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 62 మంది ఎక్స్ సరీ్వస్‌మెన్లు ఉన్నారని తెలిపారు. కమాండెంట్ మురళీకృష్ణ, బాక్సర్ నిఖత్ జరీన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment