
హర్మన్ ప్రీత్ కౌర్
ముంబై : మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని సూపర్ నోవాస్ జట్టు విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్ అసలు సిసలు ఐపీఎల్ మజాను చూపించింది. భారత ఓపెనర్ స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టుతో జరిగిన ఈ టీ20 చాలెంజింగ్ గేమ్‌లో సూపర్ నోవాస్ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్‌బ్లేజర్స్ కెప్టెన్ స్మృతి మంధాన(14) నిరాశపరచగా.. సుజీ బేట్స్(32), దీప్తీ శర్మ(21)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది.
130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌నోవాస్ జట్టుకి ఓపెనర్లు మిథాలీ, వైట్‌లు మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఏక్తా బిస్త్ వేసిన ఆరో ఓవర్ 4వ బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన మిథాలీ(22) తాహుహుకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాతి ఓవర్‌లో మరో ఓపెనర్ వైట్(24) పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో మూనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టింది. హర్మన్‌ప్రీత్(21) సైతం ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అనంతరం సూపర్ నోవాస్ విజయానికి 21 బంతుల్లో 17 పరుగులు కావాల్సి ఉండగా.. పెర్రీ(13 నాటౌట్) కడవరకు నిలిచి పుజావస్రాకర్(2) సాయంతో ఆఖరి బంతికి విజయాన్నందించింది. విజయానికి నాలుగు పరుగు కావాల్సి ఉండగా ఏడో వికెట్‌గా మష్రామ్ (4) రనౌట్‌గా వెనుదిరిగింది. ఇక చివరి ఓవర్‌ను వేసిన బేట్స్ కట్టుదిట్టమైన బంతులేయడంతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. తొలి రెండు బంతులు ఎదుర్కొన్న పెర్రీ సింగిల్ మాత్రమే తీసింది. పుజావస్రాకర్ సైతం రెండు బంతులు ఎదుర్కొని సింగిల్ తీసింది. పెర్రీ మరో పరుగు తీసి స్కోర్‌ను సమం చేసింది. చివరి బంతికి విజయానికి ఒక పరుగు కావాల్సి ఉండగా పుజా పని పూర్తి చేసింది. 7 వికెట్లు కోల్పోయి సూపర్ నోవాస్ లక్ష్యాన్ని చేధించింది.
Comments
Please login to add a commentAdd a comment