
'వారిద్దరూ బెట్టింగ్ కు పాల్పడ్డారు'
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మేయప్పన్, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బెట్టింగ్ కు పాల్పడ్డారని అత్యున్నత ధర్మానసం నిర్ధారించింది. శ్రీనివాసన్ పై ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో శ్రీనివాసన్ కు క్లీన్ చీట్ వచ్చినట్టైంది. తీర్పు పాఠాన్ని130 పేజీల్లో పొందుపరిచింది.
ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 17న తుది వాదనలు విన్న ద్విసభ్య బెంచ్ తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు వెలువరించింది. 18 నెలల క్రితం ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు సంబంధించి ఆరోపణలు వెలువడ్డాయి. కొందరు ఆటగాళ్లతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు సంబంధించిన వ్యక్తులతో ఫిక్సింగ్‌తో సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో వారి ప్రమేయంపై దర్యాప్తు జరిగింది.
అనంతరం ఫిక్సింగ్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ముద్గల్ కమిటీని నియమించడంతో పాటు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేసును పూర్తి స్థాయిలో విచారించిన ముద్గల్ కమిటీ ఫిక్సింగ్‌లో బీసీసీఐలోని కొంతమంది పెద్దలు, ఆటగాళ్ల ప్రమేయం ఉందని తేల్చింది.