బెంగళూరు: టి20 ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమని భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. అయితే పరాజయాన్ని దిగమింగడం నేర్చుకున్నానని చెప్పాడు. ‘ఇప్పుడైనా, ఎప్పుడైనా అలాంటి ఫైనల్ ఎన్నో అనుభావాలను మిగులుస్తుంది. కానీ ఓ క్రీడాకారుడిగా భావోద్వేగ పరిస్థితులను తొందరగా అధిగమించి తర్వాతి సవాలుకు సిద్ధం కావాలి. జట్టుగా మేం అద్భుతంగా ఆడాం. అన్ని అంశాల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించాం.
అయితే ఫైనల్లో మాత్రం మేం అనుకున్న విధంగా జరగలేదు. దీంతో చాలా నిరాశ చెందాం. దాని నుంచి బయటపడటం అంత సులువు కాదు’ అని ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడుతున్న యువీ వ్యాఖ్యానించాడు. గెలుపును, ఓటమిని సమానంగా స్వీకరించాలని తన బాల్యంలో ఓ కోచ్ చెప్పాడన్నాడు. దానినే తాను పాటిస్తున్నానని తెలిపాడు.
సంతోషంగా ఉంది
రాయల్ చాలెంజర్స్ జట్టుతో జత కట్టడం చాలా సంతోషంగా ఉందని యువీ వెల్లడించాడు. ఈ సీజన్ తమకు మధురానుభూతిగా మిగిలిపోగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘గత కొన్ని రోజులుగా టీమ్ కలిసి మెలిసి గడిపింది. జట్టు కూర్పు గురించి చర్చించుకున్నాం. విలువైన ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొన్నాం. మా వ్యూహాలను రచించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. టైటిల్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం’ అని యువీ వ్యాఖ్యానించాడు.
గేల్, మురళీధరన్, డివిలియర్స్, వెటోరి, డొనాల్డ్ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నాడు. తొలి మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన యువీపై బెంగళూరు జట్టు ప్రశంసల వర్షం కురిపించింది. యువీపై తమకు నమ్మకం ఉందని కోహ్లి వ్యాఖ్యానించాడు.
ఓటమిని దిగమింగడం నేర్చుకున్నా: యువీ
Published Fri, Apr 18 2014 1:07 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM
Advertisement