తెలుగు రాష్ట్రాల్లో ‘తానా’ చెస్ టోర్నీలు
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ సంఘాల సహకారంతో రాష్ట్ర స్థాయి స్కాలర్ షిప్ చెస్ టోర్నీలు నిర్వహించనున్నట్లు ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గోగినేని తెలిపారు. గురువారం సోమాజీగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా ఈ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జిల్లా పరిషత్ (జెడ్‌పీ) ఉన్నత పాఠశాల్లో 8, 9, 10 తరగతులు చదివే విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. ఎంట్రీ ఉచితమన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రయాణ ఖర్చులతో పాటు, ఉచితంగానే వసతి సౌకర్యాలు, భోజన సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న విశ్లేషణ సామర్థ్యం వెలితీయటం, వ్యూహాత్మకంగా సమస్యలను అధిగమించే శక్తి, పోటీ తత్త్వం మెరుగుపరచడం, చదువుకు గాను స్కాలర్‌షిప్‌లు సాధించుకొనే శక్తి కల్గించాలనే సదుద్దేశంతో, సదాశయంతో ఈ పోటీలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
ముందుగా జరిగే ఈ టోర్నీలో ప్రతి జిల్లా నుంచి 8, 9, 10వ తరగతి విభాగాల నుంచి ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను పోటీల ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 18, 19వ తేదీల్లో విజయవాడలో... 26, 27వ తేదీల్లో హైదరాబాద్‌లో జరుగుతాయని చెప్పారు. ప్రథమ విజేతకు రూ. 50 వేలు, ద్వితీయ విజేతకు రూ.30 వేలు ఉపకార వేతనాలు ఉంటాయన్నారు. ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర టోర్నీలో జిల్లా స్థాయిలోని బాలబాలికల విభాగం విజేతలకు రూ. 10 వేలు ఉపకార వేతనం అందజేస్తామన్నారు. డిసెంబర్ రెండో వారంలో అన్ని జిల్లాల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. అక్కడ గెలుపొందిన ఐదుగురు బాలికలు, బాలుర విజేతలకు రాష్ట్రస్థారుు పోటీలకు ఎంపిక, జిల్లా చెస్ సంఘాల ద్వారా జరుగుతుందన్నారు. వివరాలకు 9490000252 నెంబర్లో సంప్రదించాలి. మీడియా సమావేశంలో తెలంగాణ చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. వెంకటేశ్వరరావు, అసోసియేట్ మెంబర్ చిత్రకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.