తన్మయ్ అగర్వాల్, అక్షర్ పటేల్‌కు సహచరుల అభినందన
సాక్షి, హైదరాబాద్: తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన హైదరాబాద్ టాపార్డర్ రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. దీంతో ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ కోలుకుంది. బుధవారం ఆట ముగిసే సమయానికి 83 ఓవర్లలో 6 వికెట్లకు 239 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (170 బంతుల్లో 96; 13 ఫోర్లు) కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ అక్షత్ రెడ్డి (92 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్), బావనక సందీప్ (74 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
ప్రత్యర్థి బౌలర్లలో రూశ్ కలారియా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 295/9తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన గుజరాత్ జట్టు 88 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. దీంతో గుజరాత్‌కు 80 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. నేడు ఆటకు చివరి రోజు కాగా హైదరాబాద్ ప్రస్తుతం 159 పరుగుల ముందంజలో ఉంది. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి.
మిలింద్ ఖాతాలో చివరి వికెట్...
మూడో రోజు ఆట ప్రారంభంలోనే గుజరాత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మిలింద్ బౌలింగ్‌లో మెహదీహసన్‌కు క్యాచ్ ఇచ్చి ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ రూశ్ (37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) పెవిలియన్ చేరాడు. దీంతో 4.2 ఓవర్లలో గుజరాత్ ఆట ముగిసింది.
రాణించిన టాపార్డర్...
రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో ఆడింది. తన్మయ్ వికెట్‌కు ప్రాధాన్యమివ్వగా, అక్షత్ కాస్త దూకుడు ప్రదర్శించాడు. దీంతో హైదరాబాద్ 76/0తో లంచ్ విరామానికెళ్లింది. భోజన విరామానంతరం తొలి ఓవర్‌లోనే అక్షర్ బౌలింగ్‌లో అక్షత్ పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన శశిధర్ రెడ్డి (9) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. సందీప్ అండతో తన్మయ్ రాణించడంతో టీ విరామానికి హైదరాబాద్ 178/2తో నిలిచింది. అయితే మూడో సెషన్‌లో తడబడిన హైదరాబాద్ 38 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లను కోల్పోయి 216/6తో నిలిచింది. టీ విరామానంతరం సందీప్ క్లీన్‌బౌల్డ్ కాగా... హిమాలయ్ అగర్వాల్ (9) పేలవ షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. సెంచరీకి సమీపిస్తోన్న తన్మయ్‌ని స్పిన్నర్ అక్షర్ ఎల్బీగా అవుట్ చేశాడు. రూశ్ బౌలింగ్‌లో ధ్రువ్‌కు క్యాచ్ ఇచ్చి సీవీ మిలింద్ (10) అవుటయ్యాడు. ప్రస్తుతం తనయ్ త్యాగరాజన్ (10 బ్యాటింగ్), కొల్లా సమంత్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 233; గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 313; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూ (బి) అక్షర్ పటేల్ 96; అక్షత్ రెడ్డి (బి) అక్షర్ పటేల్ 45; శశిధర్ రెడ్డి (సి) మన్‌ప్రీత్ జునేజా (బి) రూశ్ కలారియా 41; హిమాలయ్ అగర్వాల్ (సి) ప్రియాంక్ పాంచల్ (బి) చింతన్ గాజా 9; కొల్లా సుమంత్ (బ్యాటింగ్) 13; సీవీ మిలింద్ (సి) ధ్రువ్ రవళ్ (బి) రూశ్ కలారియా 10; తనయ్ త్యాగరాజన్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (83 ఓవర్లలో 6 వికెట్లకు) 239.
వికెట్ల పతనం: 1–80, 2–123, 3–182, 4–204, 5–204, 6–216.
బౌలింగ్: రూశ్ కలారియా 13–2–38–2, చింతన్ గాజా 12–2–26–1, అర్జాన్ నగ్వాస్‌వాలా 13–3–35–1, అక్షర్ పటేల్ 23–3–44–2, రుజుల్ భట్ 9–1–34–0, పీయూశ్ చావ్లా 13–1–61–0.
Comments
Please login to add a commentAdd a comment