విదిత్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత 13 రౌండ్‌ల తర్వాత విదిత్ 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయంతో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల విదిత్ వచ్చే ఏడాది ఇదే టోర్నీలో ‘మాస్టర్స్’ విభాగంలో పోటీపడేందుకు అర్హత సాధించాడు. మొత్తం 14 మంది పాల్గొన్న చాలెంజర్స్ విభాగంలో 12 మంది గ్రాండ్‌మాస్టర్లు, ఒకరు మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం), అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ విభాగంలో భారత్ తరఫున విదిత్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పాల్గొన్నారు. చివరిదైన 13వ రౌండ్‌లో జోర్దాన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్)తో తలపడిన విదిత్ 24 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీ లో విదిత్ ఐదు గేముల్లో గెలిచి, మిగతా ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఐదు పాయింట్లతో హారిక 13వ స్థానంలో నిలిచింది.
కార్ల్‌సన్‌కు టైటిల్
మరోవైపు ఇదే వేదికపై జరిగిన మాస్టర్స్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) ఆరోసారి టైటిల్ గెలుపొందాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్‌లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్‌సన్, అనీష్ గిరి (నెదర్లాండ్స్) తొమ్మిది పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహించగా కార్ల్‌సన్ 1.5–0.5తో అనీష్ గిరిని ఓడించాడు. భారత స్టార్ విశ్వనాథన్ ఆనంద్ 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.
ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. చాలెంజర్స్ టోర్నీలో విజేతగా నిలిచినందుకు వచ్చే ఏడాది కార్ల్‌సన్, ఆనంద్, కరువానా, అనీష్ గిరి, సో వెస్లీలాంటి మేటి ఆటగాళ్లు పాల్గొనే మాస్టర్స్ విభాగంలో పోటీపడే అవకాశం దక్కింది. ఈ విజయంతోనైనా నాకు స్పాన్సర్లు లభిస్తారని ఆశిస్తున్నాను.
– విదిత్
Comments
Please login to add a commentAdd a comment