vidith
-
విదిత్ గుజరాతీ సంచలన విజయం
టొరంటో: ప్రతిష్టాత్మక ‘ఫిడే’ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో రెండో రౌండ్లో నాలుగు గేమ్‌లలో కూడా ఫలితం వచ్చింది. భారత గ్రాండ్‌మాస్టర్ విది త్ గుజరాతీ...అమెరికాకు చెందిన వరల్డ్ నంబర్ 3 హికారు నకమురాపై 29 ఎత్తుల్లో సంచలన విజయం సాధించడం విశేషం. వరుసగా 47 గేమ్‌లలో ఓటమి లేకుండా కొనసాగిన నకమురా విజయయాత్రకు విదిత్ బ్రేక్ వేశాడు. భారత ఆటగాళ్ల మధ్య జరిగిన పోరులో డి.గుకేశ్ 33 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు. ఇతర రెండో రౌండ్ గేమ్‌లలో ఇయాన్ నెపొనియాచి (రష్యా ) 45 ఎత్తుల్లో అలీ రెజా ఫిరోజా (ఫ్రాన్స్)పై విజయం సాధించగా...మరో గేమ్‌లో ఫాబియానో కరూనా (అమెరికా) 37 ఎత్తుల్లో నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)పై గెలుపొందాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కోనేరు హంపి తన రెండో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. కటారినా లాగ్నో (ఉక్రెయిన్)తో ఈ గేమ్ 38 ఎత్తుల తర్వాత ముగిసింది. మరో గేమ్‌లో మ్యాచ్‌లలో చైనాకు చెందిన టాన్ జోంగీ చేతిలో భారత ప్లేయర్ వైశాలి ఓటమిపాలైంది. -
విదిత్ సంచలనం
బకూ (అజర్బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్, రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్‌ని షితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విదిత్ 4–2తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. ముందుగా 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించగా ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించారు. ఈ రెండింటిలో విదిత్ గెలుపొందడం విశేషం. తొలి గేమ్‌లో 60 ఎత్తుల్లో గెలిచిన విదిత్ రెండో గేమ్‌లో 52 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో విదిత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఈ టోర్నీలో నాలుగో భారత ప్లేయర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ఇప్పటికే ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్ చేరారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌లలో కార్ల్సన్ (నార్వే)తో గుకేశ్; నిజాత్ అబసోవ్ (అజర్బైజాన్)తో విదిత్; ప్రజ్ఞానందతో అర్జున్; కరువానా (అమెరికా)తో లీనియర్ (అమెరికా) తలపడతారు. హారిక ఓటమి మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో హారిక 3.5–4.5తో అలెగ్జాండ్రా గోర్యాచ్కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. వీరిద్దరి మధ్య రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ ఫార్మాట్లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌లో గోర్యాచ్కినా, రెండో గేమ్‌లో హారిక గెలిచారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం నిర్వహించిన రెండు గేమ్‌లు ‘డ్రా’ కావడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో గోర్యాచ్కినా 43 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 95 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. -
విజేత విదిత్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నమెంట్లో చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత 13 రౌండ్ల తర్వాత విదిత్ 9 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయంతో మహారాష్ట్రకు చెందిన 23 ఏళ్ల విదిత్ వచ్చే ఏడాది ఇదే టోర్నీలో ‘మాస్టర్స్’ విభాగంలో పోటీపడేందుకు అర్హత సాధించాడు. మొత్తం 14 మంది పాల్గొన్న చాలెంజర్స్ విభాగంలో 12 మంది గ్రాండ్‌మాస్టర్లు, ఒకరు మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం), అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ విభాగంలో భారత్ తరఫున విదిత్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పాల్గొన్నారు. చివరిదైన 13వ రౌండ్లో జోర్దాన్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్)తో తలపడిన విదిత్ 24 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీ లో విదిత్ ఐదు గేముల్లో గెలిచి, మిగతా ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఐదు పాయింట్లతో హారిక 13వ స్థానంలో నిలిచింది. కార్ల్‌సన్‌కు టైటిల్ మరోవైపు ఇదే వేదికపై జరిగిన మాస్టర్స్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) ఆరోసారి టైటిల్ గెలుపొందాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్ల్సన్, అనీష్ గిరి (నెదర్లాండ్స్) తొమ్మిది పాయింట్లతో సమఉజ్జీగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహించగా కార్ల్సన్ 1.5–0.5తో అనీష్ గిరిని ఓడించాడు. భారత స్టార్ విశ్వనాథన్ ఆనంద్ 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. చాలెంజర్స్ టోర్నీలో విజేతగా నిలిచినందుకు వచ్చే ఏడాది కార్ల్సన్, ఆనంద్, కరువానా, అనీష్ గిరి, సో వెస్లీలాంటి మేటి ఆటగాళ్లు పాల్గొనే మాస్టర్స్ విభాగంలో పోటీపడే అవకాశం దక్కింది. ఈ విజయంతోనైనా నాకు స్పాన్సర్లు లభిస్తారని ఆశిస్తున్నాను. – విదిత్ -
ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్‌ను నిలువరించిన విదిత్
ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి నిలకడగా రాణిస్తున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో శుక్రవారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను విదిత్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ప్రస్తుతం విదిత్ 5.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు క్రామ్నిక్ (రష్యా)తో జరిగిన గేమ్‌లో హారిక 53 ఎత్తులో ఓడిపోయింది. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రౌండ్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత పురుషుల జట్టు 1.5–2.5తో పోలాండ్ చేతిలో ఓడిపోగా... మహిళల విభాగంలో జార్జియాతో జరిగిన మ్యాచ్‌ను భారత జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. పురుషుల జట్టులో విదిత్ గెలుపొందగా... ఆదిబన్, కార్తికేయన్ ఓడిపోయారు. పరిమార్జన్ నేగి తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. మహిళల జట్టులో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 72 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జెపై నెగ్గగా... ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లు తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. విజయలక్ష్మి ఓటమి పాలైంది.