
బకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతి సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్, రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నిపోమ్‌ని షితో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విదిత్ 4–2తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణీత రెండు క్లాసికల్ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు.
ముందుగా 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించగా ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించారు. ఈ రెండింటిలో విదిత్ గెలుపొందడం విశేషం. తొలి గేమ్‌లో 60 ఎత్తుల్లో గెలిచిన విదిత్ రెండో గేమ్‌లో 52 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో విదిత్‌కు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. ఈ టోర్నీలో నాలుగో భారత ప్లేయర్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. ఇప్పటికే ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద క్వార్టర్ ఫైనల్ చేరారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌లలో కార్ల్‌సన్ (నార్వే)తో గుకేశ్; నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)తో విదిత్; ప్రజ్ఞానందతో అర్జున్; కరువానా (అమెరికా)తో లీనియర్ (అమెరికా) తలపడతారు.
హారిక ఓటమి
మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో హారిక 3.5–4.5తో అలెగ్జాండ్రా గోర్యాచ్‌కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. వీరిద్దరి మధ్య
రెండు క్లాసికల్ గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్ ఫార్మాట్‌లో టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌లో గోర్యాచ్‌కినా, రెండో గేమ్‌లో హారిక గెలిచారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం నిర్వహించిన రెండు గేమ్‌లు ‘డ్రా’ కావడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో గోర్యాచ్‌కినా 43 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 95 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment