సిరీస్‌పై భారత్‌‘ఎ’ గురి | Team india 'A' targeted the series | Sakshi
Sakshi News home page

సిరీస్‌పై భారత్‌‘ఎ’ గురి

Published Tue, Sep 17 2013 1:41 AM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

సిరీస్‌పై భారత్‌‘ఎ’ గురి - Sakshi

సిరీస్‌పై భారత్‌‘ఎ’ గురి


 బెంగళూరు: దుమ్ము రేపే ఆటతీరుతో తొలి వన్డేలో వెస్టిండీస్ ‘ఎ’ జట్టును అదరగొట్టిన భారత్ ‘ఎ’ జట్టు నేడు (మంగళవారం) మరో పోరుకు సిద్ధమవుతోంది. చిన్నస్వామి మైదానంలో జరిగే ఈ రెండో వన్డేను సైతం నెగ్గి సిరీస్‌ను దక్కించుకోవాలని యువరాజ్ సింగ్ బృందం భావిస్తోంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో యువరాజ్ అంచనాలను అందుకుని సూపర్ సెంచరీతో జట్టుకు 77 పరుగుల విజయాన్ని అందించాడు. జాతీయ జట్టులో మళ్లీ చోటు కోసం పరితపిస్తున్న యువీ సెలక్టర్లు తనకిచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసి పట్టుకున్నాడు. కఠోర శ్రమతో పూర్తి ఫిట్‌నెస్ సాధించి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. అద్భుతమైన స్ట్రోక్ షాట్లతో 89 బంతుల్లోనే 123 పరుగులు చేసి జట్టులో స్థానంపై ఆశలు పెంచుకున్నాడు. అటు సీనియర్ ఆటగాడు యూసుఫ్ పఠాన్ కూడా తనదైన శైలిని ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపించాడు.
 
  జాతీయ జట్టులో స్థానం కోసం అతను కూడా చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. నేటి మ్యాచ్‌లోనూ మరోసారి సత్తా చూపాలనుకుంటున్నాడు. ఇక ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, ఉన్ముక్త్ చంద్ కూడా రాణిస్తే విండీస్‌కు కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఉతప్ప కూడా విండీస్, దక్షిణాఫ్రికాలతో జరిగే భారత వన్డే సిరీస్‌పై ఆశలు పెట్టుకున్నాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడాలని భావిస్తున్నాడు. ఇక మిడిలార్డర్‌లో యువీతో పాటు మన్‌దీప్ సింగ్, నమన్ ఓజా బ్యాట్ ఝుళిపిస్తున్నారు. అటు బౌలింగ్ విభాగం కూడా తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చూపింది. ఇర్ఫాన్, ప్రవీణ్ సిరీస్‌కు దూరమైనా వినయ్ సారథ్యంలోని బౌలింగ్ విభాగం అంచనాలను అందుకుని రాణించింది. ఇదే రీతిన సమష్టి కృషితో వరుసగా రెండో వన్డే సిరీస్‌ను అందుకోవాలనే ఆలోచనలో భారత ఆటగాళ్లు ఉన్నారు.
 
 ఒత్తిడిలో విండీస్ ‘ఎ’
 స్వదేశంలో శ్రీలంక ‘ఎ’తో జరిగిన వనే ్డలో విశేషంగా రాణించిన విండీస్ ‘ఎ’ ఈ వన్డేలోనైనా సత్తా చూపించి సిరీస్‌లో నిలవాలనుకుంటోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్లకు పని చెప్పాల్సి ఉంది. బోనర్, కెప్టెన్ పావెల్‌తో పాటు అంతర్జాతీయ వన్డే అరంగేట్రంలోనే శతకం బాదిన కిర్క్ ఎడ్వర్డ్ తమ సత్తా చూపిస్తే జట్టుకు ప్రయోజనంగా ఉంటుంది. గత వన్డేలో దేవ్ నారాయణ్, నర్స్ మాత్రమే అర్ధ సెంచరీలు సాధించి ఆకట్టుకున్నారు. ఆల్‌రౌండర్ రస్సెల్ కూడా ఈ వన్డేలో మెరిస్తే భారత జట్టు గట్టి పోటీని ఎదుర్కొంటుంది. బౌలర్లు పటిష్ట భారత లైనప్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడం జట్టును ఆందోళనపరిచే అంశం.
 
 జట్లు: భారత్ ‘ఎ’: యువరాజ్ (కెప్టెన్), ఉన్ముక్త్, ఉతప్ప, అపరాజిత్, జాదవ్, నమన్ ఓజా, యూసుఫ్, ఉనాద్కట్, వినయ్, కౌల్, నర్వాల్, నదీమ్, మన్ దీప్ సింగ్, రాహుల్ శర్మ.
 విండీస్ ‘ఎ’: పావెల్ (కెప్టెన్), పెరుమాల్, బీటన్, బానర్, కార్టర్, కోట్రెల్, కమ్మిన్స్, దేవ్ నారాయణ్, మిల్లర్, నర్స్, రస్సెల్, థామస్.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement