
కన్నీరుమున్నీరైన మేరీకోమ్
ముంబై: మణిపూర్ మణిమకుటం, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ఐదుసార్లు నిలిచిన భారత మహిళగా చరిత్ర సృష్టించిన మేరీ కోమ్ కన్నీటి పర్యంతమయ్యారు. భారతదేశంలో మహిళ బాక్సర్లెందరికో ఒక స్ఫూర్తిగా నిలిచిన ఆమె ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టించింది.
సెలక్షన్ ప్రక్రియలో బాక్సింగ్ రిఫరీలు, జడ్జిలు తనపై వివక్ష చూపిస్తున్నారని మేరో కోమ్ ఆరోపిస్తున్నారు. వారి ప్రాంతీయ దురభిమానం వల్ల తనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈశాన్య భారతానికి చెందినదాన్ని కావడంతోనే తన పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ముందు తాను భారతీయురాలిని అనే విషయాన్ని గమనించాలన్నారు.
తన చేతిలో అనేకసార్లు ఓడిపోయిన హర్యానాకు చెందిన పింకీ జాంగ్రాకే సెలక్లర్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఒలింపిక పతక విజేత మేరీకోమ్ వాపోయింది. అయినా తాను నిరుత్సాహపడననీ, తనకీ అవమానాలు, వివక్ష కొత్తకాదనీ, గతంలో ఇలాంటివి చాలా అనుభవించానన్నారు. తానేంటో బాక్సింగ్ రింగ్ లో నిరూపించుకుంటానంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయింది. దీంతో పక్కనే సింధు ఆమెను ఓదార్చారు.