ముంబై: లెఫ్టార్మ్ స్పిన్నర్ సిదక్ సింగ్... భారత మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సరసన చేరాడు. 19 ఏళ్లు కూడా నిండని ఈ కుర్రాడు... స్పిన్ దిగ్గజం సరసన చేరడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా! కల్నల్ సీకే నాయుడు అండర్–23 క్రికెట్ టోర్నమెంట్‌లో పుదుచ్చేరి బౌలర్ సిదక్ సింగ్ ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. గతంలో అనిల్ కుంబ్లే (10/74; 1999లో పాకిస్తాన్‌పై) ఫిరోజ్ షా కోట్లా టెస్టులో ఈ ఘనత సాధించగా... అంతకుముందు 1956లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ (10/53) ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో పుదుచ్చేరి తరఫున బరిలో దిగిన సిదక్ మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 7 మెయిడెన్ల సహా 17.5 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి 10 వికెట్లు పడ గొట్టాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిదక్ గతంలో ముంబై తరఫున ఆడినా తాజాగా పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఘనత కలలో కూడా ఊహించలేదు. అండర్–16 మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టాను’ అని సంతోషం వ్యక్తం చేశాడు. సిదక్ చెలరేగడంతో మణిపూర్ తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత పుదుచ్చేరి 105 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 51 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment