మనోళ్లకు 12 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఐర్లాండ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ కరాటే, కిక్ బాక్సింగ్ యూనియన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. ఈ పోటీల్లో 12 పతకాలు సాధించారు. ఇందులో 4 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన డాక్టర్ విద్యాసాగర్ కాంస్యం గెలుపొందగా, వ్యక్తిగత విభాగంలో కావ్య మీనన్, ఆకాంక్ష పాటిల్, వెలువోలు సాకేత్, అన్మిశ్ శరత్ వర్మ రన్నరప్‌గా నిలిచి రజత పతకాలు సాధించారు. ఈ నలుగురితో కూడిన బృందం టీమ్ కుమిటేలో మూడో స్థానంలో నిలిచింది. అశ్విని ఆనంద్ వ్యక్తిగత, టీమ్ కుమిటేలో చెరో కాంస్యం గెలిచింది.
విద్యాసాగర్, ప్రభు చరణ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యాలు గెలిచారు. ఈ జట్టుకు శిహాన్ సాయి కుమార్ కోచ్‌గా, విజయ్ కుమార్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఐర్లాండ్‌లోని కెర్రీ సిటీలో ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో ట్రెడిషనల్ కరాటే, లైట్ కాంటాక్ట్, ఫుట్ కాంటాక్ట్, కిక్ బాక్సింగ్, ఎమ్‌ఎమ్‌ఏ, వెపన్ కాంపిటీషన్ మ్యూజికల్, నాన్ మ్యూజికల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. 32 దేశాలకు చెందిన 2000 మంది కరాటే క్రీడాకారులు పాల్గొన్నారు.