
తెలుగు టైటాన్స్ జోరు
పుణెరి పల్టాన్‌పై ఘనవిజయం
సాక్షి, విశాఖపట్నం: ప్రొకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతోంది. స్థానిక పోర్టు స్టేడియంలో సోమవారం పుణెరి పల్టాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 60-24 తేడాతో అద్భుత విజయం సాధించింది. టైటాన్స్‌కి వైజాగ్‌లో ఇది వరుసగా రెండో విజయం కాగా తొలి గేమ్ డ్రాగా ముగిసింది. టైటాన్స్ తరఫున దీపక్ నివాస్ హుడ్డా 16 రైడ్ పాయింట్లతో అదరగొట్టగా... రాహుల్ చౌదరి 8 మందిని రైడ్ చేశాడు.
జట్టు ఆటగాళ్ల అద్భుత ఆటతీరు కారణంగా ప్రత్యర్థి జట్టు 8 సార్లు ఆలౌట్ అయింది. ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన పుణేరి జట్టుపై తెలుగు టైటాన్స్ పూర్తి ఆధిక్యత ప్రదర్శించి విజయం సాధించింది. వైజాగ్ వేదికగా తెలుగు టైటాన్స్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో నేడు (మంగళవారం) దబంగ్ ఢిల్లీతో తలపడనుంది. మరో మ్యాచ్‌లో పాట్నా పైరైట్స్‌పై బెంగాల్ వారియర్స్ జట్టు 30-28తో గెలిచింది.