భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు
కేఎస్‌సీఏ టోర్నీ ఫైనల్లో ఆంధ్ర జట్టు
సాక్షి, విజయవాడ: కెప్టెన్ శ్రీకర్ భరత్, సుమంత్ డబుల్ సెంచరీలు సాధించడంతో... కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఆధ్వర్యంలో మైసూరులో జరుగుతోన్న తిమ్మ ప్పయ్య ఇన్విటేషన్ జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేఎస్‌సీఏ ఎలెవన్‌తో శనివారం ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో ఫలితాన్ని టాస్ ద్వారా నిర్ణయించారు.
మ్యాచ్‌లో రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ పూర్తి కాకపోవడంతో టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించడానికి టాస్ నిర్వహించగా... ఇందులో ఆంధ్ర జట్టును విజయం వరించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 191.3 ఓవర్లలో 6 వికెట్లకు 591 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
శ్రీకర్ భరత్ (492 బంతుల్లో 218; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు), సుమంత్ (363 బంతుల్లో 202 నాటౌట్; 21 ఫోర్లు, ఒక సిక్స్) డబుల్ సెంచరీలతో కదంతొక్కారు. అనంతరం కేఎస్‌సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 310 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’ అయింది. అభిషేక్ రెడ్డి (155 నాటౌట్; 16 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (100 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలు సాధించారు.