విధ్వంసం సాగిందిలా...
ఒక్క పరుగుకే తప్పిన రనౌట్... ఆ తర్వాత బంతిని ఎదుర్కోవడంలోనే ఇబ్బంది పడుతూ మెయిడిన్ ఓవర్... వెంటనే 4 పరుగుల వద్దే సునాయాస క్యాచ్ నేలపాలు... 22వ బంతికి మొదటి బౌండరీ... ఆరంభంలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ సాగిన తీరిది... రెండు నెలల విరామం తర్వాత టీమిండియాకు ఆడుతుండటంతో పాటు తన ఓపెనింగ్ స్థానంపై ఉన్న అనిశ్చితి కూడా అతనిపై ఒత్తిడి పెంచినట్లుంది. అందుకే క్రీజ్‌లో ఉంటే చాలనే తరహాలో బ్యాటింగ్ కనిపించింది. అయితే ఒక్కసారి నిలదొక్కుకున్నాక అతను విలయం సృష్టించాడు. ఏ బౌలర్‌నూ లెక్క చేయకుండా విరుచుకుపడ్డ తీరు అసలు సిసలు రోహిత్‌ను చూపించింది. ఏడాది వ్యవధిలో రెండో ‘రెండొందలు’ అతనికి వందనం చేసింది.
అన్ని రకాలుగా...
ఈ ఇన్నింగ్స్ మొత్తం చూస్తే రోహిత్ ఆడని షాట్ లేదు. మైదానంలో అతను బంతిని పంపించని చోటు లేదు. అతని విధ్వంసం బారిన పడని బౌలర్ లేడు. వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ బ్యాటింగ్ రుచి చూసిన శ్రీలంక బౌలర్లు ఇక్కడ మరీ నిస్సహాయంగా మారిపోయారు. చూడచక్కని డ్రైవ్‌లు, అద్భుతమైన కట్ షాట్‌లు, ఆకట్టుకునే లేట్ కట్, పుల్ షాట్, తనదైన శైలిలో చిన్న మార్పుతో హెలికాప్టర్ షాట్‌లు... ఇలా ప్రతీది పరుగుల ప్రవాహాన్ని అందించింది.
ఆ షాట్ అపూర్వం...
కులశేఖర వేసిన 48వ ఓవర్ చివరి బంతికి రోహిత్ ఆడిన షాట్ అయితే నిజంగా అపూర్వం. ఆఫ్ స్టంప్‌కు చాలా దూరంగా పడి వైడ్‌గా వెళుతున్న హాఫ్ వాలీ బంతి... రోహిత్ కుడివైపు అడుగున్నర వరకు కదిలాడు. ఆ వైపు నుంచి ఆన్‌సైడ్‌లో ఆడిన ఆ బంతి మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మారింది! అతని షాట్లలో ఎక్కడా తడబాటు లేదు.
తిరుగులేని బ్యాటింగ్...
అర్ధ సెంచరీ చేసేందుకు 72 బంతులు తీసుకున్న రోహిత్ మరో 28 బంతుల తర్వాత సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శతకం తర్వాతే అతను మరింత చెలరేగిపోయాడు. తర్వాతి 164 పరుగులను అతను 73 బంతుల్లోనే అందుకున్నాడు. 200 నుంచి 250 పరుగుల మైలురాయిని చేరుకునేందుకు అయితే అతనికి 15 బంతులే సరిపోయాయి!
రికార్డులు సృష్టిస్తూ....
ఈ క్రమంలో అత్యధిక ఫోర్లు సహా అనేక రికార్డులు అలవోకగా అందుకుంటూ ముందుకు సాగాడు. ముందుగా తన అత్యధిక స్కోరు (209)ను అధిగమించిన ఈ ముంబైకర్... ఎరంగ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది సెహ్వాగ్ (219) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. గత ఏడాది బెంగళూరులో ద్విశతకం సాధించిన రోజున చిన్నస్వామి మైదానం చాలా చిన్నదన్నారు. కానీ క్లాస్‌కు, సత్తాకు మైదానం సైజు లెక్క కాదని ఈడెన్ గార్డెన్స్‌లో అతను నిరూపించాడు. 4, 201, 222 పరుగుల వద్ద రోహిత్ క్యాచ్‌లను వదిలి లంక ఆటగాళ్లూ రికార్డులో ఇతోధిక సహాయం అందించినా... ఈ యువ ఆటగాడి ప్రదర్శనను అది తక్కువ చేయలేదు. కోహ్లితో 202 పరుగులు జత చేస్తే, అందులో 132... ఉతప్పతో 128 పరుగులు జోడిస్తే అందులో 109 రోహిత్‌వే కావడం విశేషం. 30వ ఓవర్‌నుంచి రోహిత్ దూకుడు ప్రారంభమైంది. అదే తొలి ఓవర్ నుంచే సాగితే ‘ట్రిపుల్’ కూడా సాధ్యమయ్యేదేమో!