ముద్గల్ నివేదికలో ఆ నలుగురు | The four in Mudgal report | Sakshi
Sakshi News home page

ముద్గల్ నివేదికలో ఆ నలుగురు

Published Sat, Nov 15 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

ముద్గల్ నివేదికలో ఆ నలుగురు

ముద్గల్ నివేదికలో ఆ నలుగురు

 న్యూఢిల్లీ: ఐపీఎల్-2013 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసుకు సంబంధించి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ నివేదికలో ఉన్న నలుగురి పేర్లను జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్‌ఎం ఖలీఫుల్లాతో కూడిన ప్రత్యేక బెంచ్ వెల్లడించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముఖ్య పరిపాలనా అధికారి (సీఓఓ) సుందర్ రామన్, రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌ల పేర్లు ముద్గల్ కమిటీ నివేదికలో ఉన్నాయని తెలిపింది.

‘మేం ఆ నివేదిక చదివాం. అందులో కొంత మంది వ్యక్తులు తమ వృత్తికి  విరుద్ధమైన పనులకు పాల్పడినట్టు ఉంది. ఆటగాళ్లతో పాటు తెరపై కనిపించని పాత్రధారులు కూడా వీరిలో ఉన్నారు. కమిటీ తాము కనుగొన్న అంశాలను ఇందులో పొందుపరిచింది. ఆయా వ్యక్తుల ప్రవర్తనపై పరిశోధించగా వారు దోషులేనని తేలింది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ నలుగురికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రిపోర్ట్‌లో వారికి ఏమైనా అభ్యంతరాలుంటే నాలుగు రోజుల్లోగా తెలపాలని కోరింది.

 ఈ విచారణకు సంబంధించి ముద్గల్ నివేదికను ఇరు వర్గాల (బీసీసీఐ/శ్రీనివాసన్... బీహార్ క్రికెట్ సంఘం) న్యాయవాదులకు ఇవ్వనున్నట్టు తెలిపింది. దీని ఆధారంగా ఈనెల 24న జరిగే తదుపరి విచారణలో తమ వాదనలు వినిపించవచ్చని సూచించింది. మరోవైపు నివేదికలో ఉన్న ముగ్గురు క్రికెటర్ల పేర్లను మాత్రం ప్రస్తుతానికి బహిరంగపరచడం లేదని బెంచ్ తెలిపింది.

కానీ నివేదికలో ఎవరు క్రికెటర్లు.. ఎవరు అధికారులు అనే విషయం తెలియక ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల పేర్లను అనుకోకుండా జడ్జి చదివారు. ఆ తర్వాత ఆటగాళ్ల పేర్లను తాము బయటపెట్టదలుచుకోలేదని, ఈ విషయంలో సహాయపడాలని లాయర్ హరీష్ సాల్వేను కోర్టు కోరింది.

 బీసీసీఐ ఏజీఎం మరోసారి వాయిదా
 భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సాధారణ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) మరోసారి వాయిదా పడింది. ఈనెల 20న జరగాల్సిన ఏజీఎంను ప్రస్తుత పరిణామాలతో మరో నాలుగు వారాల పాటు వాయిదా వేశారని బోర్డు కౌన్సిల్ సీఏ సుందరం కోర్టుకు తెలిపారు. శ్రీనివాసన్ తిరిగి బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ ఎన్నికలకు శ్రీనిని అనుమతిస్తారా? అని సుందరం కోర్టును అడగ్గా.. ‘ఈ కేసు విషయం తేలేదాకా ఆ ఎన్నికల్లో శ్రీనివాసన్ పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై మేం ఎలాంటి స్పష్టతను ఇవ్వలేం’ అని స్పష్టం చేసింది. బీసీసీఐ ఏజీఎంను నెల రోజుల పాటు వాయిదా వేయడం సరైన చర్య కాదని, ఇది బోర్డు రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆరోపించారు.

బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీనివాసన్‌ను ఈస్ట్ జోన్ నుంచి నామినేట్ చేసే విషయంలో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) వేచి చూసే ధోరణిని అవలంభిస్తోంది. తాము అరుణ్ జైట్లీ సూచనల మేరకు నడుచుకుంటామని దాల్మియా చెబుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement