ప్రత్యూషకు మరో విజయం
కోల్‌కతా: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో విజయాన్ని సాధించింది. అండర్-14 ప్రపంచ చాంపియన్ వైశాలి (తమిళనాడు)తో ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో ప్రత్యూష 43 ఎత్తుల్లో గెలిచింది. ఈ టోర్నీలో ప్రత్యూషకిది ఐదో విజయం. తొమ్మిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 6.5 పాయింట్లతో స్వాతి ఘాటే (ఎల్‌ఐసీ)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నూతక్కి ప్రియాంక నాలుగో పరాజయాన్ని చవిచూసింది. తొమ్మిదో రౌండ్‌లో భక్తి కులకర్ణి (గోవా) చేతిలో ప్రియాంక ఓడిపోయింది. ప్రస్తుతం పద్మిని రౌత్ (ఒడిషా) 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం జరిగే 10వ రౌండ్‌లో భక్తి కులకర్ణితో ప్రత్యూష, సౌమ్య స్వామినాథన్‌తో ప్రియాంక తలపడతారు.