
గుర్‌కీరత్‌కు అవకాశం
♦ పేసర్ శ్రీనాథ్ అరవింద్ ఎంపిక
♦ అమిత్ మిశ్రాకు చోటు
♦ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత వన్డే, టి20 జట్ల ప్రకటన
బెంగళూరు : దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై తలపడే భారత టి20 జట్టును, తొలి మూడు మ్యాచ్‌ల కోసం వన్డే జట్టును సెలక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇటీవల భారత్ ‘ఎ’ తరఫున నిలకడగా రాణించిన గుర్‌కీరత్ సింగ్‌కు తొలిసారి టీమిండియా పిలుపు లభించింది. ఈ పంజాబ్ ఆల్‌రౌండర్‌ను వన్డే టీమ్‌లోకి ఎంపిక చేశారు. దేశవాళీ పోటీల్లో ఆకట్టుకున్న కర్ణాటక పేసర్ శ్రీనాథ్ అరవింద్‌కు టి20 జట్టులో స్థానం లభించింది. ఈ రెండు మార్పులు మినహా సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎలాంటి సంచలన మార్పులకు అవకాశం ఇవ్వలేదు. సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టి20 జట్టులో స్థానం నిలబెట్టుకోగా, జింబాబ్వే సిరీస్‌కు అవకాశం దక్కని రవీంద్ర జడేజాకు మళ్లీ నిరాశే ఎదురైంది.
కుర్రాళ్లకు నో చాన్స్...
జింబాబ్వేతో వన్డేలను మినహాయిస్తే భారత జట్టు పూర్తి స్థాయి జట్టుతో చివరగా బంగ్లాదేశ్‌తో ఆడింది. ఆ సిరీస్‌లో ఉన్న ఆటగాళ్లలో ప్రధానంగా రెండు మార్పులు జరిగాయి. రవీంద్ర జడేజా, పేసర్ ధావల్ కులకర్ణిలను తప్పించారు. వారి స్థానాల్లో గుర్‌కీరత్, స్పిన్నర్ అమిత్ మిశ్రాలకు చోటు దక్కింది. శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో విశేషంగా రాణించిన మిశ్రా వన్డే, టి20లో పునరాగమనం చేయడం విశేషం. బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో స్థానం దక్కని జడేజా ఆ తర్వాత మరే దేశవాళీ మ్యాచ్ ఆడలేదు. ఫలితంగా సెలక్టర్లను ఆకట్టుకునే అవకాశం కూడా లభించలేదు.
జింబాబ్వేతో సిరీస్‌లో రాణించి ఆశలు పెట్టుకున్న మనీశ్ పాండే, కేదార్ జాదవ్‌లు రెగ్యులర్ టీమ్‌లోకి మాత్రం రాలేకపోయారు. మొహమ్మద్ షమీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. అదే విధంగా టీమిండియా ఫాస్టెస్ట్ బౌలర్లు ఉమేశ్, ఆరోన్, ఇషాంత్‌లను టి20 కోసం మాత్రం పరిగణలోకి తీసుకోకుండా మీడియం పేసర్లపైనే నమ్మకముంచారు.
ధోనిపై చర్చకు ఫుల్‌స్టాప్: టెస్టు కెప్టెన్ కోహ్లికి వన్డే, టి20 నాయకత్వ బాధ్యతలు కూడా అప్పజెపుతారంటూ ఇటీవల సాగిన హడావుడికి సెలక్టర్లు ముగింపునిచ్చారు. ఈ రెండు టీమ్‌లకు ఎమ్మెస్ ధోనినే సరైన వ్యక్తిగా వారు స్పష్టం చేశారు. ‘అసలు కెప్టెన్సీ గురించి చర్చే జరగలేదు. ధోని నాయకత్వంపై మేం సంతోషంగా ఉన్నాం. అతనికి మా పూర్తి మద్దతు ఉంది’ అని పాటిల్ స్పష్టం చేశారు.
భారత జట్ల వివరాలు: వన్డేలు: ధోని (కెప్టెన్), అశ్విన్, స్టువర్ట్ బిన్నీ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్, అక్షర్ పటేల్, రహానే, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, రోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్, గుర్‌కీరత్ సింగ్, అమిత్ మిశ్రా.
టి20లు: ధోని (కెప్టెన్), అశ్విన్, స్టువర్ట్‌బిన్నీ, ధావ న్, కోహ్లి, భువనేశ్వర్, అక్షర్, రహానే, రైనా, అంబటి రాయుడు, మోహిత్ శర్మ, రోహిత్ శర్మ, అరవింద్, హర్భజన్, మిశ్రా.
గుర్‌కీరత్: పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ మూడేళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. 40 మ్యాచ్‌ల్లో 46.10 సగటుతో 1383 పరుగులు చేశాడు. 10 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో కూడా ఆకట్టుకున్న అతని ఇటీవలి ప్రదర్శన జట్టులోకి ఎంపికయ్యేలా చేసింది. భారత్ ‘ఎ’ తరఫున ఆడుతూ ఆసీస్ ‘ఎ’తో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో 87 పరుగులు చేసి, 2 వికెట్లు తీసి జట్టును గెలిపించిన గుర్‌కీరత్... బంగ్లాదేశ్ ‘ఎ’తో తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు.
శ్రీనాథ్ అరవింద్: లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్‌తో పాటు అవసరమైతే అదే మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగలగడం అరవింద్ ప్రత్యేకత. ఏడేళ్లుగా కర్ణాటక జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కీలక విజయాల్లో భాగస్వామిగా నిలిచిన 31 ఏళ్ల అరవింద్... ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున రాణించాడు. 2011లో తొలిసారి ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా ఇతనికి మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు.