సీజన్ మారింది
ఇక తడుద్దాం గోల్స్ వర్షంలో!
మూడు నెలల పాటు టి20 క్రికెట్ వేడిని ఆస్వాదించిన క్రీడాభిమానుల కోసం కొత్త పండుగలు రాబోతున్నాయి. ఇక బౌండరీల స్థానంలో రాబోయే నెల రోజులు గోల్స్ వర్షం కురవబోతోంది. అవును... సీజన్ మారిపోయింది. క్రీడాభిమానుల కోసం ఫుట్‌బాల్‌లో రెండు పెద్ద సంబరాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచకప్‌తో సరిసమానంగా... ప్రతి క్రీడాకారుడూ ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్, యూరో కప్ రెండూ ఒకేసారి జరగబోతున్నాయి. కోపా అమెరికా కప్ ప్రారంభమై వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేకంగా ఈ సెంటినరీ కప్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నెల 3 నుంచి 26 వరకు అమెరికాలో ఈ కప్ జరుగుతుంది.
అమెరికా ఖండాల్లోని అన్ని ప్రధాన జట్లు బరిలోకి దిగే ఈ టోర్నీ ద్వారా మెస్సీ మెరుపులు మరోసారి చూడొచ్చు. ఇక యూరోప్‌లో ఫుట్‌బాల్ అభిమానులంతా ప్రాణం పెట్టి చూసే యూరో కప్ ఈ నెల 10 నుంచి జులై 10 వరకు ఫ్రాన్స్‌లో జరుగుతుంది. 24 జట్లు కప్ కోసం అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు టోర్నీల ద్వారా కావలిసినంత కిక్కే కిక్కు..! అటు కోపాలో మెస్సీ మెరుపులు చూడొచ్చు... ఇటు యూరోలో రొనాల్డో మ్యాజిక్‌ను ఆస్వాదించొచ్చు.
-సాక్షి క్రీడావిభాగం