
భారత్ పసిడి కాంతులు
రెండో రోజు నాలుగు స్వర్ణాలు
⇒ ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిఫ్
భువనేశ్వర్: సొంతగడ్డపై భారత అథ్లెట్స్ రెండో రోజూ మెరిశారు. అందుబాటులో ఉన్న నాలుగు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల, మహిళల 400 మీటర్ల విభాగాల్లో వరుసగా మొహమ్మద్ అనస్ (45.77 సెకన్లు), నిర్మలా షెరోన్ (52.01 సెకన్లు)... పురుషుల, మహిళల 1500 మీటర్ల విభాగాల్లో వరుసగా అజయ్ కుమార్ సరోజ్ (3ని:45.85 సెకన్లు), పీయూ చిత్రా (4ని:17.92 సెకన్లు) విజేతలుగా నిలిచి పసిడి పతకాలను గెల్చుకున్నారు.
మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ (11.52 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల షాట్‌పుట్‌లో తజీందర్ పాల్ సింగ్ (19.77 మీటర్లు) రజతం... పురుషుల 400 మీటర్లలో అరోకియా రాజీవ్ (46.14 సెకన్లు) రజతం... మహిళల 400 మీటర్లలో జిస్నా మాథ్యూ (53.32 సెకన్లు) కాంస్యం కైవసం చేసుకున్నారు. అంతకుముందు 4్ఠ100 మీటర్ల రిలే ప్రిలిమినరీ రేసులో భారత బృందం నిర్ణీత వ్యవధిలో ఫైనల్ బ్యాటన్‌ను అందించకపోవడంతో అనర్హత వేటుకు గురైంది. మరోవైపు డెకాథ్లాన్ ఈవెంట్‌లో పోటీపడాల్సిన భారత అథ్లెట్ జగ్తార్ సింగ్ డోపింగ్‌లో పట్టుబడటంతో అతను బరిలోకి దిగలేదు.