సానియా జంట జైత్రయాత్ర
సిడ్నీ ఓపెన్‌లోనూ విజేత ఇండో-స్విస్ జోడీకిది వరుసగా ఏడో టైటిల్
సిడ్నీ: ప్రత్యర్థులు ఎవరైనా... వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... అన్నింటినీ అధిగమిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా సిడ్నీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ జంటకే టైటిల్ లభించింది. హోరాహోరీగా సాగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 1-6, 7-5, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో కరోలినా గార్సియా-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీపై అద్భుత విజయం సాధించింది. వరుసగా 30వ మ్యాచ్‌లో గెలిచిన సానియా-హింగిస్ జంటకిది వరుసగా ఏడో టైటిల్ కాగా... ఓవరాల్‌గా 11వది. విజేతగా నిలిచిన వీరిద్దరికీ 40,200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 27 లక్షల 25 వేలు) తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతేడాది బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి ఈ టైటిల్‌ను నెగ్గిన సానియా ఈసారి హింగిస్‌తో కలిసి సాధించడం విశేషం.
73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ఒకదశలో తొలి సెట్‌ను కోల్పోయి, రెండో సెట్‌లో 2-5తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే గత ఆరు నెలలుగా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న ఈ జంట ఇలాంటి క్లిష్టమైన దశలోనూ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఓపికతో ఆడింది. చక్కటి సమన్వయంతో రాణించి వరుసగా ఐదు గేమ్‌లు గెల్చుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. సూపర్ టైబ్రేక్‌లోనూ సానియా జంట ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. తాజా టైటిల్‌తో ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జాతో కలిసి మార్టినా హింగిస్ సంయుక్తంగా అగ్రస్థానంలోకి చేరుకుంటుంది. 2000 తర్వాత టాప్ ర్యాంక్ అందుకోవడం హింగిస్‌కిదే ప్రథమం.