
ముంబై: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు, వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా టీ20, టెస్టు సిరీస్‌కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఇక్కడ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తప్పించారు సెలక్టర్లు. ఇదిలా ఉండగా ఈ మూడు సిరీస్‌లకు సంబంధించిన జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు కూడా ఎక్కడా చోటు కల్పించలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో హార్దిక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఈ కారణం చేతనే హార్దిక్‌ను తప్పించారనే వాదన వినిపించింది. కాగా, గత నెలలో ఆసియాకప్‌లో భాగంగా లీగ్ మ్యాచ్‌లో హార్దిక్ గాయపడ్డాడు. దాని నుంచి హార్దిక్ ఇంకా కోలుకోలేకపోవడంతోనే విశ్రాంతి అనివార్యమైందనేది ఎంఎస్‌కే ప్రసాద్ వ్యాఖ్యాల ద్వారా తెలుస్తోంది.
‘హార్దిక్ పాండ్య స్థాయిలో సామర్థ్యం గల ఓ పూర్తిస్థాయి ఆల్‌రౌండర్ మాకు కనిపించలేదు. పాండ్య బౌలింగ్‌తో పాటు, బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. కానీ ఈ సిరీస్‌లకు ఎంపిక చేసిన జట్టులో అతని స్థాయిలో ప్రదర్శన చేసే ఆల్‌రౌండర్ భారత జట్టులో ఏ ఆటగాడిలోనూ కనిపించలేదు. అతని సామర్థ్యాలకు సమానంగా ఉన్న ఆటగాడు దొరకడం కూడా ప్రస్తుతం కష్టమే. ఆ కారణం చేతనే జట్టులో పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయలేకపోయాం. అయితే బంతితో రాణిస్తున్న భువనేశ్వర్ కుమార్ టెస్టు సిరీస్‌లో బ్యాట్‌తోనూ సత్తా చాటగలడని ఆశిస్తున్నాం. భువీ ఆల్‌రౌండర్ ప్రదర్శన పట్ల మాకు విశ్వాసం ఉంది’ అని తెలిపాడు.