దిగ్గజాల సమరం
♦ యూరో రెండో సెమీస్ నేడు
♦ జర్మనీతో ఫ్రాన్స్ అమీతుమీ
యూరోప్ ఫుట్‌బాల్‌లో జర్మనీ, ఫ్రాన్స్ రెండూ దిగ్గజ జట్లే. రెండింటికీ ఘన చరిత్ర ఉంది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా అభిమానులు మునివేళ్లపై నిలబడాల్సిందే. అందుకే ప్రపంచ చాంపియన్ జర్మనీ, ఆతిథ్య ఫ్రాన్స్‌ల మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ను ఫైనల్‌లా భావిస్తున్నారు.
మార్సెల్లే : జర్మనీ, ఫ్రాన్స్‌ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్‌లు జరిగితేనే అభిమానులు పనులన్నీ పక్కనబెట్టి టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఈ రెండు జట్ల మధ్య యూరో లాంటి మెగా టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్ అంటే కచ్చితంగా చూసి తీరాల్సిందే. టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఇరుజట్లలోనూ సూపర్‌స్టార్లు ఉన్నారు. మ్యాచ్‌లో ఏ జట్టును కూడా ఫేవరెట్‌గా ఊహించలేకపోయినా ఆతిథ్య ఫ్రాన్స్‌కు స్టేడియంలో ఎక్కువగా మద్దతు ఉండబోతోంది.
సూపర్ ఫామ్
ఈసారి యూరోకప్‌ను నెగ్గి ఎక్కువసార్లు ఈ ట్రోఫీని చేజిక్కించుకున్న జట్టుగా (మూడుసార్లు) జర్మనీ, స్పెయిన్‌ల సరసన నిలవాలనే లక్ష్యంతో ఫ్రాన్స్ యూరో బరిలోకి దిగింది. జట్టులోని ఫార్వర్డ్ ఆటగాళ్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. గ్రిజ్‌మన్ 5 గోల్స్‌తో టోర్నీలో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతుండగా.. గిరుడ్, పయెట్ ప్రత్యర్థి డిఫెండర్లను ఆటాడుకుంటున్నారు. భారీ అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన పోగ్బా గత మ్యాచ్‌లో గోల్ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. జట్టు డిఫెన్స్ కూడా బలంగా ఉంది. 2014 ప్రపంచకప్‌లో తమను క్వార్టర్స్‌లో ఓడించిన జర్మనీపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఫ్రాన్స్ ఆడబోతోంది.
గాయాల సమస్య
యూరోకప్‌ను నాలుగోసారి సాధించి ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలవాలని భావిస్తోన్న జర్మనీకి ఆటగాళ్ల గాయాలు సమస్యలు తెచ్చిపెట్టాయి. స్ట్రైకర్ మారియో గోమెజ్ గాయంతో టోర్నీకి దూరమవగా, మిడ్‌ఫీల్డర్ సమీ కెదీరా కూడా గాయంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. కెప్టెన్ ష్వాన్‌స్టైగర్ ఆడేది కూడా అనుమానమే. డిఫెండర్ మ్యాట్ హమ్మల్స్ టోర్నీలో రెండో యెల్లో కార్డు వల్ల మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయినా జర్మనీని తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. రిజర్వ్ బెంచ్‌పై కూడా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మిడ్‌ఫీల్డ్‌లో స్టార్ ఆటగాళ్లు టోనీ క్రూస్, థామస్ ముల్లర్, మెసుట్ ఓజిల్, డ్రాక్సులర్ ఆడతారు. జర్మనీ డిఫెన్స్ అభేద్యంగా ఉంది. ఇక జర్మనీకి అతిపెద్ద బలం గోల్‌కీపర్ నోయర్. 1958 తర్వాత ఇప్పటివరకు ఏ మేజర్ టోర్నీలో ఫ్రాన్స్ చేతిలో ఓడని జర్మనీ అదే రికార్డును కొనసాగించాలని చూస్తోంది.